తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న మరో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో బాధితుల సంఖ్య 404కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 45 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 348 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు బులెటిన్ లో పేర్కొంది. 
 
రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలతో సంబంధం ఉన్నవారే ఎక్కువమంది కావడం గమనార్హం. మంత్రి ఈటల రాజేందర్ మర్కజ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన న్యాయమూర్తులు రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ నిర్ణయంతో పాటు హైకోర్టు తెలంగాణ కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేయాలని మరో నిర్ణయం తీసుకుంది. గతంలో మే 1 నుంచి జూన్ 5 వరకు న్యాయస్థానాలకు సెలవులు ప్రకటించేవారు. ఈ సంవత్సరం మాత్రం వేసవి సెలవుల్లో కూడా కోర్టులు పని చేయనున్నాయి. మరోవైపు కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 
 
తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్రం దేశంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాత్రం కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: