ఎటు చూసినా ఇప్పుడు కరోనా వార్తలే..అన్నీ భయపెట్టే వార్తలే.. అక్కడ అన్ని కేసులు పెరిగాయి.. ఇక్కడ ఇంత మంది చనిపోయారు. దారుణం.. ఆ దేశంలో శవాల గుట్టలు.. మహా దారుణం.. ఈ దేశంలో చివరిచూపూ లేదు.. అన్నీ ఇలాంటి వార్తలే. కానీ ఇలాంటి దుర్వార్తల మధ్య కారు చీకటిలో కాంతి పుంజాల్లో కొన్ని బ్రహ్మాండమైన శుభవార్తలూ ఉన్నాయి. అవే ఇప్పుడు ప్రపంచానికి ఆశాదీపాల్లా కనిపిస్తున్నాయి.

 

 

అలాంటిదే ఈ వార్త. ఇది దేశంలోని ఓజిల్లా విజయగాధ. కొన్ని రోజుల క్రితం 27 పాజిటివ్ కేసులతో దేశంలోనే రెండో స్థానం సంపాదించిన జిల్లా అది. మాములుగా అయితే ఆ జిల్లాలో ఇప్పుడు కేసుల సంఖ్య వంద దాటి ఉండాలి. రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావాలి. కానీ ఆ జిల్లా యంత్రాంగం కరోనాపై విజయవంతంగా పోరాడింది. అనేక చర్యలతో కరోనాను కట్టడి చేసింది. వారం రోజులుగా ఆ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాక పోవడం ఆ జిల్లా సాధించిన ఘనత.

 

 

ఇప్పుడు ఈ విజయం దేశానికే పాఠంగా మారింది. దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. మిగిలిన రాష్ట్రాలకు పరిచయం చేస్తోంది. ఇంతకీ అక్కడ ఏంచేశారు..ఎలా కరోనాను కట్టడి చేశారు.. తెలుసుకుందాం.. తొలి కేసు నమోదైన తర్వాత రోజే జిల్లాలో తొలి దశ కర్ఫ్యూ అమలుచేశారు. జిల్లా సరిహద్దుల్ని మూసివేశారు. నిత్యావసరాలు మినహా అన్నింటినీ నిలిపివేశారు.

 

జిల్లా మొత్తం 7 వేల బృందాలతో సేవలు అందించారు. పక్కాగా అనుమానితుల గుర్తించడం, పరీక్షలు జరపడం, పకడ్బందీగా క్వారంటైన్‌ అమలు చేయడం ద్వారా కట్టడి చేశారు. 20 లక్షల మంది స్థానికుల్ని అతి తక్కువ సమయంలో సర్వే చేశారు. పాజిటివ్ కేసుల వచ్చి వారి ఇళ్ల చుట్టూ కిలోమీటరు వరకూ కరోనా జోన్ గా ప్రకటించి అన్ని చర్యలు తీసుకున్నారు. ఇంటింటికీ ప్రభుత్వమే కూరగాయలు, పండ్లు, పాలు సరఫరా చేసింది. ఇలా అన్నివైపుల నుంచి దిగ్బంధనం చేసి కరోనాపై ఘన విజయం సాధించిందీ బిల్వారా జిల్లా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: