తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు మాట నిల‌బెట్టుకున్నారు. కరోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో క్రియాశీలంగా కృషి చేస్తున్న కేసీఆర్ ఈ క్ర‌మంలో ప‌లు ఆవేశాలు, ఆగ్ర‌హాలు వ్య‌క్తం చేస్తుండటంతో పాటుగా త‌న హుందాత‌నాన్ని సైతం చాటుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ  పోరాటంలో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహకాలను ప్రకటించి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. వైద్యశాఖ సిబ్బంది సేవలకు ప్రోత్సహకంగా వారందరికీ 10 శాతం గ్రాస్‌ శాలరీ, దీంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 95,392 మంది మున్సిపల్‌, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సహకంగా రూ. 5 వేలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ కార్మికులకు రూ.7,500 ఇవ్వ‌నున్న‌ట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు.

 

రాష్ర్టాన్ని కాపాడటంలో వైద్యులు, పారిశుధ్య సిబ్బంది కనిపించే దేవుళ్లు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. వారిని తమ సైనికులుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాల్సిందిగా సీఎం కోరారు.  ఇప్పుడు కష్టకాలంలో ఉన్నం కాబట్టి తక్కువ ఇస్తున్నం. కానీ ప్రభుత్వం వీరిని గుండెల్లో పెట్టుకుంటుందని తప్పక గుర్తింపు ఉంటుందని సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయా వ‌ర్గాల‌కు మేలు చేస్తామ‌ని ఇచ్చిన హామీ మేర‌కు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

ఇదిలాఉండ‌గా, కరోనా వైరస్‌ నివారణలో భాగంగా విశేష సేవలందిస్తున్న మున్సిపల్‌ కార్మికులు, డాక్టర్ల, వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రోత్సాహకాలు ప్రకటించడం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ  వెంకటరెడ్డి అన్నారు. కొవిడ్‌-19 ను అరికట్టడానికి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలు సముచితంగా ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా వలస కార్మికులు, నిరుపేదలు, చేతివృత్తులవారికి బియ్యం సరఫరా 60 శాతం పూర్తయినట్టు జిల్లాల నుంచి తమకు సమాచారం అందిదన్నారు. కుటుంబాలకు ఇచ్చే రూ.1,500 ఆర్థికసాయాన్ని పేదల ఖాతాల్లో నేరుగా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగించే అవకాశం ఉన్నందున ఇలాంటి సమస్యలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: