క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో దేశంలో మార్చి 25న విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ఏప్రిల్‌14తో ముగియనుంది.  ఈ లాక్ డౌన్ వ‌ల్ల వివిధ వ‌ర్గాలు ప్ర‌భావితం అవుతున్నాయి. భారత్‌లో లాక్‌డౌన్‌ వల్ల అసంఘటిత రంగాలకు చెందిన 40 కోట్ల కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. మ‌రోవైపు కరోనాపై దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలని ఇటీవల ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలిసిపోయామని లేదా ఓడిపోయామని ఎవరూ భావించవద్దన్న ఆయన.. ఈ మహమ్మారిపై దేశం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగి ఉండాలన్నారు. దీంతో లాక్‌డౌన్‌ను కేంద్రం మరికొంత కాలం కొనసాగించే అవకాశమున్నదన్న ప్రచారం జరుగుతోంది.

 

ఇదే స‌మ‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. లాక్‌డౌన్ కొన‌సాగించాల‌ని ఆయ‌న సూచించారు. దేశంలో వైరస్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి ఏడు రాష్ర్టాల సీఎంలతో పాటు కొందరు నిఫుణులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై సమాలోచనలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి తుదినిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొంటున్నాయి. ఇదిలాఉండ‌గా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందం సమావేశం జరిగింది. మే 15 వరకు విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేత కొనసాగించాలని, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని ఈ బృందం సూచించింది. 

 

మ‌రోవైపు, లాక్‌డౌన్‌పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  ‘తెలంగాణ సంగతికి వస్తే సగటున రోజుకు రూ.430-440 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. మార్చిలో మొద టి 15 రోజులు ఆదాయం వచ్చింది. లాక్‌ డౌన్‌ నుంచి ఏమీ రాలేదు. ఏప్రిల్‌లో ఆరురోజుల్లో రూ.2300-2500 కోట్ల ఆదాయం రావాలి. కానీ, రూ.6 కోట్లే వచ్చింది. పైసలు పోతే పోయా. కానీ సచ్చుడు బతుకుడు చూసుకుంటే మన దగ్గర తక్కువగానే ఉంది. అదొక్కటి సంతోషంగా ఉన్నది. మనకు అమెరికా, స్పెయిన్‌, ఇటలీలో ఉన్నట్లుగా శవాల గుట్టలైతే లేవు. బతికుంటే బలుసాకు తిని బతుకుతాం. ఆకలి నుంచి ప్రజల్ని ఏ విధంగానైనా కాపాడుకోవచ్చు. కలోగంజో తాగి బతుకుతాం. ఎకానమీ ఎట్లనైనా రివైవ్‌ చేసుకుంటాం. కష్టపడుతాం. తిరిగి రివైవ్‌ అవుతాం. కానీ, ప్రజల జీవితాలను, బతుకును రివైవ్‌ చేసుకోలేం. అందుకే మనకు ప్రాణాలు ముఖ్యం’ అని సీఎం అన్నారు. లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: