తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో నిన్నటివరకూ 404 కేసులు నమోదు కాగా ఏపీలో ఈరోజు కొత్తగా 15 కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 329కు చేరింది. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. కానీ కొందరు మాత్రం పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉండటంతో హైదరాబాద్ పోలీసులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
పోలీస్ శాఖ చిన్నచిన్న కారణాలు చెబుతూ రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇకనుంచి అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వారి బైకులను పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. అత్యవసర కారణాల వల్ల రోడ్లపైకి వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నారు. మిగిలిన వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. పోలీసులు లాక్ డౌన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నా కొన్ని చోట్ల వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
నగరంలో అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, పాతబస్తీ, బంజారాహిల్స్, జుబ్లీ హిల్స్, పంజాగుట్ట ప్రాంతాలలో వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో పోలీస్ ఉన్నాతాధికారులు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అధికారులు 100కు పైగా హాట్ స్పాట్లను అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.  రాష్ట్ర ప్రజలు కూడా లాక్ డౌన్ పొడిగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: