కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. ఎంపీల జీతాల్లో 30 శాతం కోత పెట్టాలన్న నిర్ణయాన్ని సమర్ధించారు. అయితే కొన్ని కీలక సలహాలు కూడా చేశారు. కరోనా కట్టడి- ఆర్ధిక వ్యవస్థపై ప్రభావాలకు సంబంధించి సూచనలు చేశారు. మోడీకి సోనియా ఇచ్చిన ఐదు సలహాలు ఏంటో చూడండి.

 

మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ అన్ని పార్టీల నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రులతో పాటు సోనియా గాంధీకి కూడా కాల్ చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలను వివరించారు. ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో చెప్పాలి అంటూ సలహాలు అడిగారు.  దీనిపై సోనియా గాంధీ స్పందించారు.  సవివరంగా మోడీకి ఓ లేఖ రాశారు.

 

కరోనా కట్టిడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్ధిస్తూనే కొన్ని సూచనలు చేశారు. ఎంపీల జీతాల్లో 30 శాతం కోతపెట్టడాన్ని అభినందించారు. అయితే ఈ చర్యలు మాత్రం సరిపోవంటూ ఐదు సలహాలు ఇచ్చారు సోనియా గాంధీ.

 

సలహా 1 -  రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనలపై నిషేధం విధించాలి. టీవీ, ప్రింట్, ఆన్‌లైన్ ప్రకటనలను ప్రభుత్వం పక్కన పెట్టాలి. కేవలం ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన ప్రకటనలను మాత్రమే ఇవ్వాలి. దీని ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 

 

సలహా 2-  సెంట్రల్ విస్తా ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలి. పార్లమెంట్ సహా ఢిల్లీలో కొత్త ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దానికి సెంట్రల్ విస్తా అని పేరుపెట్టారు. దీనికి 20వేల కోట్లను కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసి...ఆ నిధులను ఆస్పత్రుల నిర్మాణం, వైద్య పరీక్షలు, పీపీఈల కొనుగోలుకు కేటాయించాలి. 

 

సలహా 3-  కేంద్ర ప్రభుత్వ ఖర్చుల్లో 30 శాతం కోత పెట్టాలి. దీని వల్ల ఏడాకి 2.5 లక్షల కోట్లు మిగులుతుంది. ఈ నిధులను వలస కార్మికులు, కూలీలు, రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. 

 

సలహా 4-  ప్రభుత్వం వైపు నుంచి అన్ని విదేశీ పర్యటనలను రద్దు చేయాలి. గత ఐదేళ్లలో పీఎం, కేంద్ర మంత్రుల పర్యటనలకు 393 కోట్ల ఖర్చయ్యింది. ఇకపై విదేశీ పర్యటనలు లేకుండా చూడాలి. ఆ నిధులను కోవిడ్ 19 కోసం వాడాలి.

 

సలహా 5-  పీఎం కేర్స్ నిధులను... పీఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలి. కరోనా వైరస్‌ పై పోరాటం కోసం ప్రత్యేకంగా పీఎం కేర్స్ పేరుతో నిధిని ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తుంది కేంద్రం. ఈ నిధులన్నింటినీ పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు బదిలీ చేయడం ద్వారా పారదర్శకత ఉంటుంది.

 

ఇవీ ప్రధానమంత్రి మోడీకి సోనియా ఇచ్చిన ఐదు సలహాలు.  మోడీ వీటిలో ఎన్నింటిని పరిశీలిస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: