కరోనా వైరస్ వ్యాప్తి ఏపీలో తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అక్కడి డాక్టర్ సుధాకర్ రావు తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ పేరుకే 150 పడకల ఆసుపత్రి ఉందని, కనీస సౌకర్యాలు లేవని, మాస్కులు, వైద్య పరికరాలు అందుబాటులో లేవని, డాక్టర్లకు ఒక కేవలం ఒక్క మాస్క్ ఇచ్చి 15 రోజులు వాదమంటున్నారని, మంత్రి ఎమ్మెల్యే కూడా ఆసుపత్రికి రాలేదని, నర్సీపట్నం ఆసుపత్రి పరిస్థితులపై జిల్లా కోఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా, పట్టించుకోరని ఇంకా అనేక ఆరోపణలు చేశారు. 

 

ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించి డాక్టర్ తీరును తప్పు పట్టారు. ఉద్దేశపూర్వకంగానే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఆయన విశాఖ టిడిపి నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రోద్భలంతోనే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ గట్టిగానే ఎదురు దాడి చేసింది. అలాగే ఏపీలో మాస్క్ ల కొరత ఎక్కడా లేదని, ఇప్పటికే అన్ని కిట్లు అందించామని క్లారిటీ ఇచ్చారు. 


అయినా వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ విషయంపై విచారణ బృందాన్ని నియమించింది. అంతేకాకుండా బుధవారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్, విశాఖ జిల్లా నర్సీపట్నం రీజినల్ ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఆయనపై జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ్డం, 144సెక్షన్ ఉల్లగించడం, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి కేసులను నమోదు చేసింది. ఏప్రిల్‌ 3 నాటికే పీపీఈలు 20, ఎన్‌–95 మాస్కులు 32, హెచ్‌ఐవీ మాస్కులు 35 అందుబాటులో ఉన్నట్లు నిన్ననే ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: