ఢిల్లీ నిజాముద్దీన్‌ తబ్లిగ్‌ జమాత్‌ ప్రార్థనలకు  వెళ్లివచ్చిన వారిపై నిఘా కొన‌సాగుతోంది. హైద‌రాబాద్ ప‌రిధిలో వీరిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు అధికారులు. కొందరు మాత్రం తప్పుడు ఆలోచనతో వ్యాధి సోకిందని తెలిసినా.. యథేచ్ఛగా బయట తిరుగుతూ..ఇతరులకు వ్యాపింపచేస్తున్నారు. ఫలితంగా వారి కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ  ప్రార్థనలకు వెళ్లివచ్చినవారిని గుర్తించడంతోపాటు వారు ఎవరెవరిని కలిశారనే దానిపై కూపీ లాగుతున్నారు. 

 

హైద‌రాబాద్ జగద్గిరిగుట్ట చంద్రగిరినగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం మొదలైంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అతను ఢిల్లీ తబ్లిగ్‌ జమాత్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడని తేలింది. అతను మార్చి 17 తర్వాత ఢిల్లీ నుంచి నగరానికి వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను దాదాపు 200 మందిని కలిసినట్లు తేలింది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా అతను సహకరించకుండా విషయాన్ని దాచిపెట్టడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురై కరోనాతో మరణించాడు. 

 

ఇలా ప‌లువురు ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయాన్ని దాచిపెట్టి వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్న విష‌యం తెలియ‌డంతో అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులతో పాటు సైబరాబాద్‌ పోలీసులు నగరంలో తిష్టవేసిన వీరిని దాదాపు గుర్తించి వారు నగరానికి వచ్చి ఇప్పటి వరకు ఎంత మందిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. దీని కోసం పోలీసులు క్రైం ఇన్విస్టిగేషన్‌ ప్రారంభించారు. ప్రాథమిక దశలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారి కాల్‌డేటాను ఆరా తీస్తున్నారు. వారు నగరానికి ఎప్పుడు వచ్చారు... ఆ తర్వాత ఎన్ని చోట్ల తిరిగారు... ఎవరెవరిని కలిశారు.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మ్యాపింగ్‌ చేసుకుని... మొత్తం వ్య‌క్తుల‌ను గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో బలమైన పెట్రోలింగ్‌ వ్యవస్థతో 24 గంటలూ పోలీసులు పనిచేస్తున్నారు. పెట్రోలింగ్‌ వాహనాలు క్వారంటైన్‌ సెంటర్లు, దవాఖానలు, పాజిటివ్‌ కేసులు వచ్చిన వారి ఇళ్ల‌కు వెళ్లి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: