మోడీ అంటే ధైర్యం ఉన్న నేత. ఎదురులేని నాయకుడు. ఇరుగు పొరుగు దేశాలకు ఎలా గుణపాఠం చెప్పాలలో, దారికి తెచ్చుకోవాలో తెలిసిన మొనగాడు. ఆయన పేరుకు ముందు  విజేత. వెనకాల ఘనాపాటీ అన్న ట్యాగులు ఉండాల్సిందే. అటువంటి మోడీని చూసే భారత ప్రజలు ఎన్ని కష్టాలైనా భరిస్తున్నారు. ఎన్ని రకాల బాధలైనా తట్టుకుంటున్నారు.

 

మోడీ జనతా కర్ఫ్యూ అన్నా, లాక్ డౌన్ అని చేప్పినా కూడా సరేనంటూ జత కలిసారు తప్ప ఎవరూ వేరుగా మాట్లాడలేదు. ఇక లాక్ డౌన్ ని మరో రెండు మూడు వారాల పాటు పొడిగిస్తారన్న సమాచారంతో జనంలో కొంత భయం ఉంది. అయితే మోడీ చెబితే ఓకే అన్న తీరున 130 కోట్ల మంది భారతీయులూ ఉన్నారు. మోడీ సైతం అలా జనాలను ముందే ప్రిపేర్ చేయడంలో దిట్ట.

 

ఇపుడు లాక్ డౌన్ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ కూడా జనాలను మోడీ సమాయత్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మోడీ తాజాగా అన్న మాటలను చూస్తే రేపటి భారతం చాలా చాలా  భయానకమని  అనిపించకమానదు. 

 

కరోనా ముందు తరువాత అని మోడీ అంటున్నారిపుడు. అంటే మెల్లగా జనాలను ఆ దిశగా నడిపిస్తున్నారన్న మాట. రేపటి భారతం అచ్చంగా ఇలా ఉండదు, ఎందుకంటే ఇప్పటి మాదిరిగా నూరు శాతం ఆనందాలు ఉండవు, అవి సగమైనా కావచ్చు. మూడవ వంతు అయినా కావచ్చు. కొందరికి అవి కూడా లేకపోవచ్చు. 

 

ఎందుకంటే దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా పతనం అంచున ఉంది. కరోనా మహమ్మారిని జయించినా కూడా కనీసంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకూ మళ్ళీ కూడదీసుకోవడం కష్టమన్న భావన మోడీ మాటలను బట్టి అర్ధం చేసుకోవాలి. దేశీయ ఉపాధి రంగం కునారిల్లుతుంది. అలాగే ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. కొన్ని రంగాల్లో అయితే మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఏది ఏమైనా రానున్నది గడ్డు కాలమని మోడీ మాస్టార్ నర్మగర్భంగా చెప్పేశారు. 

 

లాక్ డౌన్ 21 రోజులకే సతమతమవుతున్న వారు, సణుగుతున్న వారు, లాక్ డౌన్ పొడిగిస్తే వీల్లేదని గర్జించే వారు ఇకపైన సౌండ్ చేయడం మానుకుంటే మంచిదేమో. ఇప్పటి నుంచే శాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటే మరీ మంచిదేమో. ఎందుకంటే రానున్నది కఠిన  పరీక్షల కాలం. ప్రతి ఒక్కరి సరదాలు తీర్చేసే పాడు కాలం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: