కరోనా మహమ్మారిపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందకుండా గత 15 రోజుల నుంచి కఠినమైన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. కానీ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఈ లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

 

ఇదిలా ఉంటే తాజాగా కరోనాని కట్టడి చేసేందుకు మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు, మాజీ పి‌ఎంలు, సీఎంలు, మాజీ సీఎంలకు ఫోన్లు చేసి పలు సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ ప్రధానికి ఐదు సలహాలు ఇచ్చారు.  మీడియా అడ్వర్టైజ్ మెంట్లపై రెండేళ్లపాటు నిషేధం విధించాలని, నూతన పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపివేయాలని తెలిపారు.

 

అలాగే ప్రభుత్వ ఖర్చును 30 శాతం తగ్గించుకోవాలని, కేంద్ర మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని, పీఎం కేర్స్ నిధులను, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించారు. అయితే ఇందులో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సలహా ఏదైనా ఉందటే, అది మీడియాకు యాడ్స్ ఇవ్వడం. అసలు బీజేపీ ప్రభుత్వం వచ్చాకే మీడియాకు యాడ్స్ ఇవ్వడం ఎక్కువ జరుగుతుంది.

 

ఎక్కువ శాతం మోదీ ప్రభుత్వం మీడియా యాడ్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని సోనియా తెలివిగా, కరోనాపై పోరాటానికి రెండేళ్ళు మీడియా ప్రకటనలు ఆపేసి, ఆ నిధులని ఉపయోగించాలని సలహా ఇచ్చారు. అయితే సోనియా ఇచ్చిన సలహకు వెంటనే షాక్ తగిలింది. ఈ సలహాని తాము వ్యతిరేకిస్తున్నట్టు అఖిల భారత రేడియో ఆపరేటర్ల అసోసియేషన్(ఏఆర్ఓఐ) తెలిపింది. గత ఏడాదే రేడియో ఆపరేటర్లు, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఉన్న వారు ప్రభుత్వ ప్రకటనలు తగ్గిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇక ఇప్పుడు అసలు ప్రకటనలు ఆపేస్తే మరిన్ని కష్టాలు ఎదురుకుంటారని చెప్పారు. కాగా, సోనియా ఇచ్చిన సలహాపై మోదీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: