ఏపీలో కరోనా మహమ్మారి ఎంత విజృంభిస్తుందో, అంతకంటే ఎక్కువగా వైసీపీ, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. ఈ విపత్కర సమయంలో ఏకమై కరోనాపై పోరాడకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు అంశాలపై ఈ రెండు పార్టీలు విమర్శలు కురిపించుకున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఉన్న మెడ్‌టెక్ జోన్‌పై రెండు పార్టీలు గొప్పలు చెప్పుకునే పనిలో ఉన్నాయి. విశాఖ మెడిటెక్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదని టీడీపీ నేతలు చెబుతుంటే, ఆ మెడ్‌టెక్ జోన్‌ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే, దానికి నిధులు మంజూరు చేసి అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్‌ది అని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు.

 

అసలు వీళ్ళు గొప్పలు చెప్పుకునే పని ఎందుకు వచ్చిందంటే, కరోనా మహమ్మారి దెబ్బకు టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల కొరత ఎక్కువ ఉంది. దీంతో వీటిని విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 200 మందికి పరీక్షలు నిర్వహించేందుకే చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ  నెలాఖరులోపు రాష్ట్రంలో 3 వేల నుంచి 4 వేల మంది కరోనా పరీక్షలు చేసేలా మెడ్‌టెక్ జోన్‌లో కిట్లు తయారు చేస్తున్నారు.

 

ఇక దీనిపై వైసీపీ, టీడీపీలు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్‌టెక్‌ జోన్‌కు నిధులిచ్చి సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ముందు చూపు వల్లే ఈ రోజు కిట్లు తయారు చేయగలిగామని అన్నారు. అయితే జగన్‌ని మంత్రి పొగిడిన వెంటనే టీడీపీ నేతలు లైన్‌లోకి వచ్చారు.

 

చంద్రబాబు దూరదృష్టి వల్లే మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేశారని, జగన్‌ కృషి వల్ల మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి కిట్లు వచ్చాయని, మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని దేవినేని ఉమా రాగం అందుకున్నారు. ఇక పనిలో పనిగా బుద్దా వెంకన్న కూడా తాళం వేశారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన మెడ్‌టెక్ జోన్‌లో వెంటిలేటర్లు, కిట్లు తయారుచేస్తున్నారని బుద్దా తన అధినేతని పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే మెడ్‌టెక్ జోన్ వ్యవహారంలో చంద్రబాబు, జగన్‌ల గొప్పతనం కంటే, ఈ టైమ్‌లో కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు త్వరగా తయారీచేస్తున్నవారే గొప్ప అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: