కొంద‌రుంటారు. క‌ష్ట‌కాలంలో గొప్ప‌గా ఆలోచిస్తుంటారు. ఎంత గొప్ప‌గా అంటే... ‘మనతోపాటు మన చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఆలోచించాలి. ప్రస్తుత గడ్డు పరిస్థితులు వారి జీవనాన్ని మరింత దయనీయంగా మార్చేశాయి. ఈ సంక్షోభం సమయాన వారందరికీ మనం అండగా ఉండాలి.` ఇలా ఉంటుంది వారి ఆలోచ‌న‌. స‌రిగ్గా ఇప్పుడు కొన్ని ప్ర‌ముఖ సంస్థ‌లు ఇదే రీతిలో ముందుకు వ‌చ్చాయి.  లాక్‌డౌన్‌లోనూ ఉద్యోగుల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ మూసివేత 21 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగినా సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని సంస్థలు చెప్తుండటం గమనార్హం. 

 

 

ఫ‌లానా రంగం అని కాకుండా... ఐటీ, ఫార్మా, నిర్మాణ, పౌల్ట్రీ, హౌస్‌ కీపింగ్‌, మెయింటేనెన్స్‌, .. ఇలా ప్రతీ సంస్థా మానవతా దృక్పథంతో స్పందిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలకు కోత విధించట్లేదని అంటున్నాయి. ఈ క్రమంలోనే రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టులో చేసేవారికీ అడ్వాన్సుగా జీతాలు చెల్లిస్తుండటం విశేషం. గతంతో పోల్చితే ఈసారి వారం రోజుల ముందే ఉద్యోగుల వేతనాన్ని బ్యాంకుల్లో జమ చేస్తున్నాయి. చాలా ప్రైవేట్‌ కంపెనీలు 7-10 తేదీల్లో ఉద్యోగులకు జీతాలిస్తాయన్న విషయం తెలిసిందే. పైగా ఉద్యోగానికి రాకున్నా పర్వాలేదని, ఇంట్లోని ఉండి లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరుతున్నాయి. కొత్త ఉద్యోగులకూ సంపూర్ణ భరోసాను కల్పిస్తున్నాయి. 

 

అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌.. భారతీయ ఉద్యోగులకు 25 శాతం అధికంగా వేతనాలను చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థలో మొత్తం 2.03 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. తాజా నిర్ణయంతో దేశంలోని దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతున్నది. ఈ నెల నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు కాగ్నిజెంట్‌ సీఈవో బ్రయాన్‌ హంప్రీస్‌ తెలిపారు. 

 

దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా తాము మాత్రం ఉద్యోగుల్ని తొలగించడం లేదని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) సంస్థ ప్రకటించింది. కాకపోతే క్రమం తప్పకుండా అందించే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో సకాలంలోనే మార్చి నెల జీతాల్ని అందజేస్తామని సమాచారాన్ని ఇచ్చింది. ఇక భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ ఇప్పటికే ఉద్యోగులకు మార్చి నెల జీతాన్ని చెల్లించింది. దాల్మియా భారత్‌ గ్రూప్‌ మార్చి 26-27 తేదీ మధ్యలోనే ఉద్యోగుల ఖాతాల్లోకి ముందస్తుగా జీతాల్ని జమ చేసింది. ఇలా బ‌డా ప్రైవేటు కంపెనీలు త‌మ ఉద‌రాత్వాన్ని చాటుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: