ఓవైపు రాష్ట్రమంతా కరోనాతో గగ్గోలు పెడుతుంటే.. టీడీపీ మాత్రం ఇలాంటి కష్టకాలంలోనూ రాజకీయాల గురించే ఆలోచిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వారికి అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. ఇటీవల జగన్ సర్కారు యూనివ‌ర్సిటీ పాలక మండ‌లి పోస్టులను భర్తీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 శాతం, మహిళకు 50 శాతం పదవులు కల్పించార‌ు. యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం వైయస్‌ జగ‌న్‌ ఆదేశించారు.

 

 

అయితే ఈ నియామకాల విషయంలో వైసీపీ రూల్స్ అన్నీ తుంగలో తొక్కిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలే ప్రధానంగా కొన్ని చానళ్లు, పత్రికలు గోల చేస్తున్నాయి. దీంతో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

మీడియా ముందుకు వచ్చారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో రెండు పోస్టులు తగ్గితే సీఎం ఒప్పుకోలేదని సజ్జల స్పష్టం చేశారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు పదవులు దక్కాల్సిందేన‌ని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు.

 

 

దేశ చ‌రిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 50 శాతం రిజ‌ర్వేష‌న్లతో ఈ పోస్టులు భ‌ర్తీ చేశారని సజ్జల అన్నారు. సామాజిక న్యాయం జరగలనే ఉద్దేశ్యంతో సీఎం వైయస్‌ జగ‌న్‌ తీసుకున్న నిర్ణయాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతుందని.. ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌కు పని తప్ప ప్రచారం అలవాటు లేదన్నారు.

 

 

అదే సమయంలో చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించిన సంగతి గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబు క్లాస్‌మేట్‌ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యుల‌ జాబితాను అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు గుడ్డిగా సంతకం పెట్టారని పాత ముచ్చట్లు బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: