ఆయన ప్రకాశం జిల్లా పరుచూరుకు చెందిన ఓ జర్నలిస్టు.. తాజాగా కరోనాతో కన్నుమూశాడు. ఆయన మృతికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం తెలిపారు. కరోనా మహమ్మారి బారినపడి ప్రముఖ జర్నలిస్ట్‌ కంచిభొట్ల బ్రహ్మానందం మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

 

 

కొవిడ్‌ కారణంగా బ్రహ్మానందం మరణించడం ఎంతో కలచివేసిందని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. జర్నలిజంలో కంచిభొట్ల చేసిన సేవలు చిరస్మరణీయమని అంజలి ఘటించారు. అమెరికాలో క‌రోనా బారిన ప‌డిన‌ ప్రముఖ జర్నలిస్ట్‌ కంచిభొట్ల బ్రహ్మానందం మ‌ర‌ణించ‌డంపై ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 

 

మరి ఇంతకీ ఈ కంచిభొట్ల బ్రహ్మానందం ఎవరు..? రచ్చ గెలిచిన ఈ గొప్ప జర్నలిస్టు గురించి తెలుగు వారికి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆయన పాత్రికేయమంతా ఆంగ్ల పత్రికల్లోనే సాగింది. కంచిభొట్ల బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పర్చూరు వాసి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆంగ్లపత్రిక ద్వారా ఆయన జర్నలిజంలో అడుగు పెట్టారు. తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ పనిచేశారు.

 

 

తర్వాత అమెరికా వెళ్లి కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. పదిరోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన..సోమవారం సాయంత్రం మరణించినట్లు న్యూయార్క్‌ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీలో వైర‌స్‌ తీవ్రత అధికంగా ఉంది. కేవ‌లం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇప్పటివ‌ర‌కు ల‌క్షా 70 వేల మంది కరోనా బారిన ప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: