కరోనాపై చేస్తున్న పోరాటంలో ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో దీన్ని ఎత్తేయాలా.. కొనసాగించాలా అనే అంశంపై ప్రధానంగా విభిన్న వర్గాలతో మోడీ చర్చిస్తున్నారు. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్షాల వీడియో కాన్ఫరెన్సులో వైసీపీ కూడా పాల్గొంది. పార్టీ తరపున వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

 

 

ఈ భేటీలో విజయసాయిరెడ్డి...ప్రజాశ్రేయస్సు దృష్ట్యా హాట్ స్పాట్లు ఉన్న ప్రాంతాలలో లాక్‌డౌన్ కొనసాగించాలని.. మిగిలిన ప్రాంతాలలో దశల వారీగా ఎత్తివేయాలని‌ కోరారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారికి కరోనా టెస్టులు చేసి నెగటివ్ వచ్చిన వారిని స్వస్ధలాలకి పంపాలని కూడా విజయసాయిరెడ్డి కోరారు. అంతే కాదు.. డొమెస్టిక్ శానిటేషన్ పద్దతులపై ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాలు రూపొందించాలని కోరారట.

 

 

అయితే ఇదే సమయంలో కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకోవాలని కూడా వైసీపీ మోడీని కోరిందట. తక్షణమే రూ. 6200 కోట్ల సాయాన్ని ఏపీకి అందించేలా చూడాలని విజయసాయి రెడ్డి మోడీని కోరారట. రాష్ట్రంలో ఉన్న1.50 కోట్ల కార్డుల రేషన్ పంపిణీలో రూ.900 కోట్లు అదనంగా భారం పడుతుందని తెలిపారు. అలాగే వెయ్యి రూపాయిల పంపిణీ ద్వారా మరో 500 కోట్ల లోటు కనిపిస్తుందని వివరించారు.

 

 

మొత్తం రూ.1400కోట్లు సాయం చేయడంతో పాటు నెలవారీగా కోల్పోయిన రూ. 4800 కోట్ల ఆదాయాన్ని ఆర్థికంగా సాయం అందించాలని ప్రధాని మోడీని విజయసాయిరెడ్డి కోరారట. అలాగే డ్వాక్రా మహిళలకి మాస్క్ లు, గ్లౌవ్స్ ఏ విధంగా తయారు చేయాలనేది టీవీల ద్వారా శిక్షణ ఇవ్వాలని సూచించారట. మరి మోడీ ఈ కోరికలు తీరుస్తాడా..?

మరింత సమాచారం తెలుసుకోండి: