కరోనాపై ప్రపంచమంతా ఏకమై పోరాడుతోంది. ఇంకా మందు కనిపెట్టని ఈ మహమ్మారి ఇదే అదనుగా విజృంభిస్తోంది. ఇప్పుడు ఈ మహమ్మారిని పారద్రోలాలంటే ప్రపంచం చేతులు కలపాలి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పోరాటానికి అనేక మంది మద్దతు తెలుపుతున్నారు. బిలియనీర్లు తమ వంతు సాయం అందిస్తున్నారు.

 

 

ఇప్పుడు కరోనాపై పోరాటానికి మరో భారీ విరాళం అందింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ -19పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించే చర్యలకు చేయూతగా వంద కోట్ల డాలర్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే మన కరెన్సీలో లెక్కేస్తే 7000 కోట్లు అన్నమాట. తన ఆన్ లైన్ ఆర్థిక సేవల సంస్థ స్క్వేర్ నుంచి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు జాక్ డోర్సీ వివరించారు. ఈ మొత్తం జాక్ సంపదలో 28 శాతంగా ఉంటుందని ఓ అంచనా.

 

 

ఊరికే డబ్బు ఇచ్చానని ప్రకటించుకోవడమే కాదు.. ఆ డబ్బు.. ఎలా సద్వినియోగం అవుతుందో అంతా తెలుసుకునేలా ఏర్పాటు కూడా చేశాడు జాక్. కరోనా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఈ మొత్తాన్ని తను స్థాపించిన సేవా సంస్థ స్టార్ట్ స్మాల్’కు జాక్ డోర్సీ తరలించారు. స్టార్ట్ స్మాల్ కు అందిన డబ్బు ఏఏ సేవా సంస్థలకు వెళ్తుందో ప్రజలందరూ తెలుసుకోగలిగేలా ఓ లింక్ ను కూడా ఆయన తెలిపారు.

 

 

అయితే ఇలా భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం జాక్‌ డోర్సీకి ఇదే తొలిసారేమీ కాదు. ఆయన గతంలోనూ భారీగా దానాలు చేశాడట. ఈ విషయం కూడా ఆయనే బయటపెట్టాడు. గతంలో కూడా తాను 40 మిలియన్ డాలర్లను గుప్తంగా దానం చేశానని జాక్ డోర్సీ అంటున్నారు. ఇకపై తాను చేసే సేవా కార్యక్రమాలన్నీ పారదర్శకంగానే ఉంటాయని జాక్ చెబుతున్నారు. జాక్ దాతృత్వానికి ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: