కొత్త రాష్ట్రం.. క‌ట్టిన ఇల్లు లేదు.. పెట్టిన పొయ్యి లేదు..! ఆర్థిక ప‌రిస్థితీ అంతంత‌మాత్ర‌మే! ఇప్పుడిప్పుడే ఓ రూపు వ‌స్తుంద‌న‌కుంటున్న త‌రుణంలోనే క‌రోనా రూపంలో వైర‌స్ మ‌హ‌మ్మారి చుట్టుముట్టింది. ఏం చేయాలో.. ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క దేశంలోని అనేక రాష్ట్రాలు విల‌విలాడుతున్న వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు పీకేందుకు ధైర్యంగా ముంద‌డుగు వేశారు. నిరంత‌ర స‌మీక్ష‌ల‌తో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌ల్లో మాన‌సిన స్థైర్యాన్ని నింపుతూనే.. బాధితుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించేందుకు ప‌క‌డ్బందీ కార్యాచ‌ర‌ణ‌తో  ముందుకువెళ్తున్నారు. లాక్‌డౌన్ వేళ‌ పేద‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా.. బియ్యంతోపాటు న‌గ‌దు అంద‌జేస్తున్నారు. ఇక‌ ఎంత వేగంగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తే..అంత వేగంగా క‌రోనాను క‌ట్ట‌డి చేయొచ్చున‌న్న క‌చ్చిత‌మైన అంచ‌నాతో దేశంలోనే తొలిసారి క‌రోనా వైర‌స్‌ను నిర్ధారించే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను త‌యారు చేయించి, అంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. 

 

నిజానికి.. కేవ‌లం 35 రోజుల వ్య‌వ‌ధిలోనే అన్ని అనుమ‌తులు పొంది. ర్యాపిడ్ కిట్ల త‌యారీని ప్రారంభించి అందుబాటులోకి తేవ‌డం అంటే.. మామూలు విష‌యం కాద‌ని, ఇది ఎంతో సంక‌ల్ప బ‌లంతో కూడుకున్న అంశ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.  బ‌హిరంగ మార్క‌ట్‌లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధ‌ర రూ.4500 ఉండ‌గా.. కేవ‌లం రూ.1200ల‌కే అంద‌జేస్తున్నారు ఒక్కో కిట్‌ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయవచ్చున‌ని, కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చున‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా.. బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ కిట్లను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చున‌ని అధికారులు వివ‌రించారు. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగిలిన రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. అలాగే.. హిందుస్థాన్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌తో క‌లిసి ఏప్రిల్‌ 15 నుంచి నెలకు 3,000 వెంటిలేటర్లు తయారు చేయనున్నామ‌ని.. ఒక్క వెంటిలేటర్‌ సహాయంతో ఐదారు మందికి వైద్యం చేసేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు.

 

అంతేగాకుండా.. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో చేర్చిన విష‌యం తెలిసిందే. నిజానికి.. ఇలా దేశంలోని ఏ రాష్ట్రం కూడా ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయింద‌నే చెప్పొచ్చు. ఆనాడు దివంగ‌త నేత‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి పేద‌ల‌కు కార్పొరేట్ వైద్య సౌక‌ర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి సంచ‌ల‌నం సృష్టించారు. ఇదే దారిలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా న‌డుస్తున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. రాష్ట్రంలోని 58 ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను కూడా ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి.. మెరుగైన వైద్య‌సేవలు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇలాంటి సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకుంటున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై నేడు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: