దేశంలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో సామాన్యులు, దినసరి కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పలు ప్రాంతాలలో జనం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు 10 రూపాయల భోజనాన్ని 5 రూపాయలకే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శివసేన ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో శివ భోజన తాలీని అందుబాటులోకి తెచ్చింది. 
 
రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తుండటం, పలు ప్రాంతాలలో ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉండటం ప్రభుత్వం దృష్టికి రావడంతో 5 రూపాయలకే భోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1000కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా ఆహారానికి ఇబ్బందులు పడుతున్నారు. 
 
రాష్ట్రంలో కేసులు పెరగకుండా ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ చేస్తోంది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా  అమలవుతున్నాయి. ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో నిన్న ఒక్కరోజే 34 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 348కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా బాధితుల అంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 49 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 453కు చేరింది. మర్కజ్ కు హాజరైన వారికి, వారి బంధువులకు పరీక్షలు పూర్తవడంతో ఇరు రాష్ట్రాల్లో తక్కువ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: