పెరుగుట విరుగుట కొరకే అంటారు.. మీడియా విషయంలో ఆ సామెత మరోసారి రుజవైందంటున్నారు విశ్లేషకులు. గత కొంతకాలంగా తెలుగు మీడియాలో విపరీతమైన పోటీ ఉంది. వాస్తవానికి మీడియా ఏమాత్రం లాభసాటి వ్యాపారం కాదు. అటు ప్రింట్ మీడియా కానీ.. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ.. తెలుగులో మహా అయితే రెండో, మూడో బతకగలిగే అంత మార్కెట్టే ఉంది. కానీ పత్రికలు, టీవీ ఛానళ్లు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తాయి.

 

 

మరి ఇవన్నీ ఎలా బతికేస్తాయి.. ఎలాంటి నడుపుతున్నారు. అంటే అది బహిరంగ రహస్యమే. అంతా రాజకీయమే.. అధికారంలో ఉన్న పార్టీలను ప్రసన్నం చేసుకుని పనులు జరిపించుకోవడం.. అధికార పార్టీ, అధికారులతో ఉండే సాన్నిహిత్యాన్ని, పరపతిని దుర్వినియోగం చేయడం ద్వారా సొమ్ముచేసుకోవడమే చాలా మీడియా సంస్థలు చేస్తున్న పని.

 

 

కొన్నాళ్ల క్రితం వరకూ కూడా తెలుగులోని టాప్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కరస్పాండెంట్లు విచ్చలవిడిగా ఖర్చు పెంచేశారు. ఎక్కడకు వెళ్లినా ప్రత్యేకమైన వాహనాలు, హోటళ్లలో బస, ప్రత్యేక ఏర్పాట్లు ఇలా అన్ని స్థాయిల్లోనూ ఖర్చు పెరిగింది. అయితే మళ్లీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో పనిచేసే స్ట్రింగర్లు, స్టాఫర్ల జీవితాల్లో ఏ మార్పు లేదు. ఒక స్థాయి ఉద్యోగులకు మాత్రం రాజవైభవం నడిచింది.

 

 

కానీ ఇప్పుడు కరోనా కాటుతో అంతా తల్లకిందులైంది. నింగి నుంచి నేలకు దిగిరాక తప్పని పరిస్థితి. వైభవాలు, వైభోగాల సంగతి అంటుంచి అసలు ఉద్యోగం అంటూ ఉంటుందా అన్న స్థాయికి కరోనా తెలుగు మీడియాను తెచ్చేసింది. మరీ ప్రింటు మీడియా స్థాయిలో కాకపోయినా ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అదే పరిస్థితి. ఈ పరిస్థితి అంతా గమనించిన పాత కాలం జర్నలిస్టులు.. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు. మరి ముందు ముందు ఏం జరగబోతుందో.. ఎన్ని మీడియా సంస్థలు నికరంగా మిగుల్తాయో.. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: