ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో కరోనా పరీక్షల్లో కొత్తగా గుంటూరులో 8, అనంతపూర్ లో 7, ప్రకాశం జిల్లాలో 3, పశ్చిమ గోదావరిలో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
రాష్ట్రంలో ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా వారియర్ వాలంటీర్లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కరోనా వారియర్ల సేవలను వినియోగించుకోనుంది. ప్రభుత్వం ఆన్ లైన్ లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారులు కరోనా వారియర్లుగా మెడికల్, డెంటల్, యునానీ, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 
 
పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ఆసక్తి ఉన్న వైద్య నిపుణులు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఎంపికైన వారి సేవలను కరోనా బాధితులకు చికిత్స చేసే ఆస్పత్రుల్లో, క్వారంటైన్ కేంద్రాలలో వినియోగించుకోనుంది. కరోనా వాలంటీర్లుగా పని చేసిన వారికి ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టే రిక్రూట్‌మెంట్లలో తగిన ప్రాధాన్యత ఇవ్వనుంది. 

 

https://health.ap.gov.in/CVPASSAPP/Covid/VolunteerJobs     వెబ్ సైట్ ద్వారా  వాలంటీర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 2000 మందికి పైగా కరోనా వాలంటీర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకున్న వాలంటీర్లకు ఆన్ లైన్ లోనే శిక్షణ ఇవ్వడంతో పాటు ఏ జిల్లా వాలంటీర్లను ఆ జిల్లాలోనే వినియోగించుకోనుంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: