దేశ వ్యాప్తంగా గత 12 గంటల్లో కరోనా పాజిటివ్  కేసులు శరవేగంగా నమోదు అవుతుండగా , ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది . గత 12 గంటలుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు  కూడా నమోదు కాకపోవడం తో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు . ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి . అయితే ఢిల్లీలోని మర్కజ్ మసీదు లో జరిగిన తబ్లీగి జమాత్ మతసమ్మేళనం లో పాల్గొని వచ్చిన వారితో అనూహ్యంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది .

 

దీనితో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు . రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించి , తబ్లీగి జమాత్ మతసమ్మేళనం లో పాల్గొన్న వారిని గుర్తించి కరోనా పాజిటివ్ ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించడమే కాకుండా , అనుమానితులను క్వారంటైన్ చేసింది . దీనితో ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమేపి తగ్గుముఖం పట్టడమే కాకుండా , గత 12  గంటలుగా 217 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చింది . అయితే ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మరి శకం ముగిసినట్లేనా ? అంటే అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు .

 

ప్రస్తుతానికి కరోనా కట్టడిలో మాత్రమే ఉన్నట్లని చెప్పుకొచ్చారు . కరోనా కట్టడిలో ఉందని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం మొదటికే   మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు . ఈ నెల 14 వ తేదీ తో లాక్ డౌన్ నిబంధనలు ముగియనుండడం తో , రాష్ట్రం లో  ప్రస్తుతం కరోనా కట్టడి లో ఉండడంతో ,  ఆంక్షలతో నిబంధనలను సడలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: