పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుతుంది. బుధవారం మరో 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 453 కేసులు తెలంగాణాలో నమోదు కాగా.. 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. బాధితుల్లో ఇప్పటిదాకా 11 మంది మృతి చెందారు. పెరుగుతున్న కేసులతో రాష్ట్రంలో 100 హాట్‌స్పాట్‌లను గుర్తించింది సర్కార్. 

 

తెలంగాణాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు నెగటివ్ రిపోర్టులు రావడంతో.. ఇప్పటికే క్వారంటయిన్ నుంచి డిశ్చార్జి చేశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళతోనే  తెలంగాణాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది వైద్య శాఖ. ఇప్పటి వరకు తెలంగాణాలోని పాజిటివ్ కేసుల్లో 200 మంది ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్లు కాగా... 100 మందికి వాళ్ల కాంటాక్టుల ద్వారా వచ్చింది.

 

ఢిల్లీ నుంచి వచ్చిన వారితో పాటు.. వారితో కలిసిన 3,158 మంది గుర్తించింది ప్రభుత్వం. వారందరి కోసం ప్రత్యేకంగా 167 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీరంతా ఈ నెలాఖరు వరకు క్వారంటైన్‌లోనే ఉండనున్నారు. అయితే ఇప్పటికే.. కరోనా వ్యాప్తి నిరోధానికి తగిన చర్యలు తీసుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో 100 గ్రామాల్ని, ప్రాంతాల్ని హాట్‌స్పాట్‌లుగా గుర్తించాలని డిసైడైంది. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్నే ఈ లిస్టులో పెట్టి.. అక్కడ ఎక్కువ కండీషన్లు పెట్టబోతోంది.

 

నిజామాబాద్‌, ఆదిలాబాద్, సూర్యా పేట, గద్వాల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాలపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 19 వార్డులు, నేరెడిగొండలో ఐదు గ్రామాలు, ఉట్నూరు మండలంలో మూడు గ్రామాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు అధికారులు. ఈ హాట్‌స్పాట్‌లకు పెద్ద సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులను ప్రభుత్వం తరలించనుంది. అలాగే, ఈ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రజలను బయటకు రానివ్వకుండా.. వారికి కావాల్సిన మందులు, సరుకులను అన్నీ డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం విధించిన రూల్స్‌ని ప్రజలు ఎవరైనా అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని తెలియజేశారు అధికారులు.

 

మరోవైపు డాక్టర్లు, నర్సులకు కావాల్సిన 80 వేల పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్‌ను సిద్దంగా ఉంచింది ప్రభుత్వం. మరో 5 లక్షల పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్‌ను ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం లక్ష ఎన్ 95 మాస్కులు ఉన్నప్పటికి అదనంగా 5 లక్షల ఎన్ 95 మాస్కులకు ఆర్డర్ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోనేందుకు సిద్ధమవుతున్నామని చెబుతోంది... ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: