నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ సస్పెన్షన్‌పై ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పీపీఈలు ఇవ్వాలన్న డాక్టర్‌ డిమాండ్‌ను సానుకూలంగా అర్ధం చేసుకోవాలని, క్రమశిక్షణా రాహిత్యంగా చూడొద్దని కోరారు. అనంతపురంలో కరోనా రక్షణ పరికరాలు లేక నలుగురు డాక్టర్లు వైరస్‌ బారిన పడ్డారని చంద్రబాబు లేఖలో తెలిపారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా చికిత్స అందిస్తున్నారని, రాష్ట్రంలో వైద్యులందరికీ పీపీఈలు అందజేయాలని సూచించారు. సుధాకర్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసి, వైద్యులందరికీ ప్రభుత్వం అండగా నిలవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

 

విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, డాక్టర్లకు ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు వాడమంటున్నారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైద్యుడు సుధాకర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 'కరోనా' సంక్షోభ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 

 

కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఇతర వైద్యుల మానసిక స్టైర్యం దెబ్బతీసేందుకు సుధాకర్‌రావు ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు అధికారులు అభిప్రాయపడ్డారు. సుధాకర్ వ్యాఖ్యలపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ .... దురుద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసత్యాలు ప్రచారం చేశారని నిర్దారణ కు వచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

 

అయితే నర్సీపట్నం డాక్టర్ సస్పెన్షన్‌ కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌ల మధ్య సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. టీడీపీ కుట్రలో వైద్యుడు పావుగా మారాడన్నారు స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌. దానికి ఆధారంగా.. మీటింగ్‌కు వచ్చే ముందు డాక్టర్ సుధాకర్, ఆయ్యన్న పాత్రుడి ఇంటికి వెళుతున్న సీసీ ఫుటేజీని బయటపెట్టారు.

 

ఇక, ఎమ్మెల్యే గణేష్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని, అత్యవసర విషయాలను పక్కన పెట్టి సంస్కారం లేకుండా మాట్లడడం సరికాదన్నారు అయ్యన్న పాత్రుడు. తాను డాక్టర్‌తో మాట్లడినట్టు రుజువు చేస్తే.. రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని, లేదంటే నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా..? అంటూ గణేష్‌కు సవాల్ విసిరారు.

 

మరోవైపు.. మాస్కులు, రక్షణ సామగ్రి అడిగిన డాక్టర్లను సస్పెండ్ చేయడం దుర్మార్గమంటూ ట్వీట్ చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఇక లోకేష్‌... సమస్యలు పరిష్కరించకుండా డాక్టర్‌పై చర్యలు తీసుకోవడం షాక్‌కు గురి చేసిందని, డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమిది అంటూ మండిపడ్డారు. డాక్టర్ల దగ్గర ఉండాల్సిన మాస్కులు కొట్టేసి, మంత్రులు ఫోజులు ఇస్తున్నారని లోకేష్‌ ఆరోపించారు.

 

మొత్తం మీద.. విశాఖ జిల్లాలో కరోనా కంటే.. ప్రస్తుతం డాక్టర్‌ను సస్పెండ్‌ చేయడమే హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: