ఆ నాలుకకు అడ్డూ అద్దుపూ ఉండదు. నచ్చితే మెచ్చుకోవడం... నచ్చకపోతే తిట్టడం... అడిగింది ఇవ్వకపోతే హెచ్చరించడం... ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ విషయంలో భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌... ఇప్పుడు పొగడ్తల వర్షం   కురిపిస్తున్నారు. 

 

అమెరికాలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. ప్రపంచంలోని మరే దేశంలోనూ లేని రీతిలో ప్రభావం చూపిస్తోంది. ఆరంభంలో కరోనాను తక్కువగా అంచనా వేసింది అమెరికా. తమ దేశంలో చైనా వైరస్‌ అడుగుపెట్టబోదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు ట్రంప్‌. అయితే ఈ నిర్లక్ష్యానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు కరోనాను ఎలా కట్టడి చేయాలో అమెరికాకు అర్థం కావడం లేదు. 


  
కరోనా బాధితుల చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధం అద్భుతంగా పని చేస్తోంది. దీంతో భారత్‌ ప్రధాని మోడీకి ఫోన్‌ చేసి... ఆ మాత్రలు కావాలని కోరారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. అయితే, ఆ మరుసటి రోజే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సహా పలు ఔషధాల ఎగుమతులపై నిషేధం విధించింది భారత్‌ సర్కార్‌. దీంతో తన అక్కసును బాహాటంగానే వెళ్లగక్కారు ట్రంప్‌. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతి చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే దేశంలో ఔషధాల నిల్వలపై సమీక్ష నిర్వహించిన భారత్‌ సర్కార్‌... మన అవసరాలకు తగిన నిల్వలు ఉంచుకొని... మిగిలిన వాటిని కరోనా బాధిత దేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై భారత్‌ ఆంక్షలు ఎత్తివేయడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో పాటు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 

 

ఇప్పటికే 4లక్షల 26 వేల మందికిపైగా కరోనా బారిన పడగా, సుమారు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో తమ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్‌ విన్నపాన్ని మన్నించి... అమెరికాకు భారత్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధం పంపడాన్ని ట్రంప్‌ కొనియాడుతున్నారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరం... భారత్‌ చేసిన సాయం మర్చిపోలేమంటున్నారు ట్రంప్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: