కొన్ని నిర్ణ‌యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. గౌర‌వాన్ని పెంచుతాయి. తాజాగా మ‌న ప‌క్క‌రాష్ట్ర సీఎం తీసుకున్న నిర్ణ‌యం అలాంటి. ఈ నెల 14 వరకు ఉన్న లాక్‌డౌన్‌ పిరియడ్‌ను మరో 15 రోజులు పెంచుతూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన ఐదుగురు సీనియర్‌ మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి ఆమోదం తెలుపుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణ‌యాని కంటే ముందే రాష్ట్రం స్వ‌యంగా లాక్‌డౌన్‌ను పిరియడ్‌ను పొడిగించడం గ‌మ‌నార్హం. అయితే, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే....ఒడిశాలో కోవిడ్ కేసులు అతి త‌క్కువ‌. అయిన‌ప్ప‌టికీ... దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఒడిషాగా నిలిచింది.

 

 

కేబినెట్ స‌మావేశం అనంత‌రం సీఎం నవీన్‌ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఒడిశాలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నట్లు వెల్లడించారు. కోవిడ్‌-19పై పోరాటానికి, కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ పిరియడ్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. కోవిడ్‌-19పై పోరాటంలో ప్రజల క్రమశిక్షణ, త్యాగం తమకు మరింత బలాన్ని ఇస్తుందని అన్నారు. రాష్ర్టానికి విమాన, రైలు సర్వీసులను నడుపొద్దని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లుగా తెలిపారు. అదేవిధంగా ఒడిశా వ్యాప్తంగా జూన్‌ 17 వరకు అన్ని విద్యాసంస్థలు బంద్‌ పాటించనున్నట్లు పేర్కొన్నారు. 

 

 


కాగా, ఇప్ప‌టికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒడిశా రాష్ట్రం మాస్క్‌ లేదా గుడ్డను తప్పనిసరి చేసింది. ఇంటినుంచి బయటికి వచ్చేవారు ముక్కు, నోటికి అడ్డుగా కనీసం రెండు వరుసలు ఉండే మాస్క్‌ లేదా చేతి రుమాలును ధరించాలని సూచించింది. ఈ ఆదేశాలు గురువారం ఉదయం 7 గంటలనుంచి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో దేశంలో ఈతరహా ఆదేశాలిచ్చిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఆ మ‌రుస‌టి రోజే ఈ నిర్న‌యం వెలువ‌డటం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: