రెండో కోనసీమగా పిలుచుకునే సిక్కోలు ప్రాంతం కొబ్బరి ఎగుమతులు లేక వెలవెలబోతోంది. ఏడాదికోమారు వచ్చే సీజన్ కాస్తా కరోనా వైరస్‌ పుణ్యమా అని కరిగిపోయింది. మంచి రేటు వచ్చిన వేళ కొనుగోళ్లు లేకపోవటంతో రైతులు కుదేలైపోయారు. 

 

సిక్కోలు జిల్లా ఉద్దానం పరిధిలో 36 వేల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. దీనిపై ప్రత్యక్షంగా...పరోక్షంగా 2 లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు. తుపానుల ప్రభావం తీరప్రాంత మండలాలపై అధికంగానే ఉంటుంది. గాలుల బీభత్సానికి ఏటా కొబ్బరి పంటకు నష్టం వాటిల్లుతోంది. గతంలో వచ్చిన తుపాన్లకు కొబ్బరి పంట అతలాకుతలమైంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా కోలుకుంటున్న సమయంలో తిత్లీ తుపాను వల్ల పూర్తిగా నష్టం వాటిల్లింది. భీకరమైన గాలుల ధాటికి ఒక్క ఉద్ధానం పరిధిలోనే 7 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. కొబ్బరి చెట్లన్నీ నేలకూలడంతో రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. మూడు నెలలకు ఒకసారి కొబ్బరి దింపు...కొబ్బరి పీచుపై వచ్చే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. 

 

ఇక...ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కొబ్బరి రైతులను కరోనా గట్టిదెబ్బే కొట్టింది. తిత్లీ అనంతరం అరకొరగా మిగిలిన కొబ్బరి పంటపైనే ఆధారపడ్డారు రైతులు. ఈ ఏడాది కొబ్బరి కాయలకు మంచి రేటు రావడంతో పరిస్థితి ఆశాజనకంగానే ఉందనుకుని సంబరపడ్డారు. ప్రతీ ఏటా మార్చి నెల రాగానే ఉద్ధానం కొబ్బరి రైతుల్లో జోష్ కనిపిస్తుంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొబ్బరి ఎగుమతులకు మాంచి గిరాకీ ఉంటుంది. టన్నుల్లో ఉద్ధానం నుంచి కొబ్బరికాయలు ఎగుమతి అవుతాయి. రెండు నెలలకు ఒకసారి వచ్చే కొబ్బరి దింపుకు ఈ సీజన్‌లో మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఐతే మార్చి నెల మొదట్లోనే కరోనా దెబ్బ తగిలింది. ఆ ప్రభావం ఉద్ధానం కొబ్బరి ఎగుమతులపై పడింది. జనతా కర్ఫ్యూ, ఆతర్వాత లాక్ డౌన్ ప్రకటించడంతో సరిగ్గా సీజన్ ప్రారంభమయ్యే సరికి ఎగుమతులు ఆగిపోయాయి. ఈ సీజన్‌లో టన్నుల్లో కొబ్బరికాయలు ఎగుమతి అవుతుంటాయి. ఐతే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో కొబ్బరి దింపు కళ్లాలు దాటి బయటికి పోలేదు.

 

ప్రస్తుతం కొబ్బరి కాయ ధర మార్కెట్‌లో 20 రూపాయల వరకూ పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఉద్ధానం కొబ్బరి రైతులు ఇంత రేటు చూడలేదు. ఎంత మంచి కొబ్బరి కాయ అయినా కేవలం 8 నుంచి 10 రూపాయలే ధర పలికేవి. కలిసొచ్చే సీజన్‌లో మంచి రేటు వచ్చిందని ఆశపడిన కొబ్బరి రైతుపై కరోనా వైరస్ నీళ్లు చల్లింది. గతంలో ఒకసారి కొబ్బరి దింపుకు సుమారు 8 వందల కాయలు దిగుబడి వచ్చేవి. కానీ వరుస తుపాన్లు, తెగుళ్ల కారణంగా దిగుబడి 150 నుంచి 200 కాయలకు మించి రావడం లేదు. 

 

ఇక...ఇలాంటి తరుణంలో దిగుబడి తగ్గినా...కొబ్బరి పంటకు మంచిధర వచ్చిందని ఆశపడుతున్న రైతులకు లాక్ డౌన్ చెక్ పెట్టింది. ఉద్ధానం నుంచి కొబ్బరికాయలు ఈ సీజన్‌లో పొరుగునే ఉన్న ఒడిశా రాష్ట్రానికి భారీగా ఎగుమతి అవుతుంటాయి. ఒడిశాలోని బరంపురంకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎక్స్ పోర్ట్ అవుతాయి. ఎగుమతులు ఓ రేంజ్‌లో జరిగే సీజన్‌లో కొబ్బరి రైతులను ప్రస్తుతం కరోనా గట్టిదెబ్బ కొట్టేసింది. లాక్ డౌన్ కారణంగా ఉగాది, శ్రీరామనవమి పండుగలకు ఒక్క లోడు కూడా ఎగుమతి కాలేదు. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కరోనా దెబ్బకు శుభకార్యాలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ఆ రకంగా వచ్చే ఆదాయం కూడా ఆగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: