చైనా.. ఈ దేశంలో అంత‌ర్గ‌తంగా ఏం జ‌రుగుతుందో అంత సుల‌భంగా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. దాని వ్యూహాలు ఇత‌ర దేశాల‌కు అస్స‌లే అంతుచిక్క‌వు. లోప‌ల ఒక‌టి చేస్తూ బ‌య‌ట‌కు మ‌రొక‌టి చెబుతుంద‌నే వాద‌న ఈ డ్రాగ‌న్ కంట్రీపై మొద‌టి నుంచీ ఉంది. అయితే.. తాజాగా.. క‌రోనా వైర‌స్ విష‌యంలో కూడా చైనా చెబుతున్న మాట‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న‌ది ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు. నిజానికి.. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రం అత్యంత ప్ర‌మాద‌కారి అయిన క‌రోనా వైర‌స్ పుట్టినా బ‌య‌టి ప్ర‌పంచాన్ని అప్ర‌మ‌త్తం చేయ‌లేద‌నే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. డిసెంబర్ 2019 నాటికి వూహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభమైనా మొద‌ట్లో దాని తీవ్రతను బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా దాచిపెట్టిందంటూ ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు మ‌రికొంద‌రు ప‌రిశోధ‌కులు అనుమానిస్తున్నారు. 

 

జనవరి ఆరంభం నాటికి అక్కడ దాదాపు 100 కేసులు నమోదయ్యాయి. కానీ, వైరస్‌ను కట్టడి చేసేందుకు జనవరి 23 దాకా తగిన చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని చివ‌రికి వూహాన్ నగర మేయర్ ఒప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత ప‌రిస్థితి అదుపుత‌ప్ప‌డంతో జనవరి 23 నుంచి వూహాన్‌లో లాక్‌డౌన్ విధించారు. ఈ వైరస్‌ గురించి డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా నివేదించింది. కానీ.. సార్స్ లాంటి వైరస్ వ్యాప్తి చెందుతోందంటూ అందరికంటే ముందే గుర్తించి, హెచ్చరించేందుకు ప్రయత్నించిన వైద్యుడు లీ వెన్లియాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బెదిరించారు. ఆ త‌ర్వాత తర్వాత కొన్ని రోజులకు డాక్టర్ లీ, కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. ఈ విష‌యం కూడా బ‌య‌టి ప్ర‌పంచానికి చాలా ఆల‌స్యంగా తెలిసింది. అయితే.. వుహాన్ న‌గ‌రంలో మొత్తం 82వేల మందికిపైగా క‌రోనా సోకిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో క‌రోనాతో మూడువేల మందికిపైగా చ‌నిపోయార‌ని చెబుతుంది. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌ని, వుహాన్‌న‌గ‌రంలో ఒక్క కూడా న‌మోదు కాలేద‌ని, క‌రోనాపై తాము విజ‌యం సాధించామ‌ని చైనా చెబుతోంది.

 

 అయితే.. వైర‌స్‌కు సంబంధించి అనేక విష‌యాల‌ను దాచిపెట్టిన చైనా.. ఇప్పుడు క‌రోనాపై విజ‌యం సాధించామ‌ని చెబుతున్న మాట‌ల్లో అస‌లు నిజం ఉందా..? అంటూ ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి.. చైనాలో సుమారు రెండు ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా సోకి ఉంటుంద‌ని ప‌లువురు ప‌రిశోధ‌కులు అనుమానిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో క‌రోనాపై విజ‌యం సాధించామ‌ని, వుహాన్ న‌గ‌రంలో పాజిటివ్ కేసుల శాతం జీరోకు ప‌డిపోయింద‌ని చైనా చెబుతున్న మాట‌లు న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని కొట్టిపారేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: