స‌హజంగా జైల్లో ఉన్న వారి గురించి కొంత ఆందోళ‌న ఉంటుంది. కానీ ఈ విష‌యం తెలిస్తే నిజంగా మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని వ‌ర్గాలు సర్వ శక్తులు ఒడ్డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రజలు కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు తపిస్తున్నారు. ఈ ఒర‌వ‌డిలో జైళ్లల్లో ఉన్న ఖైదీలు సైతం ముందుకు వ‌చ్చారు. సేవాభావంతో శానిటైజర్లు, మాస్కులు తయారుచేస్తూ తక్కువ ధరకే అందజేస్తున్నాయి. మహిళా సంఘా లు అత్యవసర సేవల్లో ఉన్న వైద్య, పోలీస్‌, పారిశుద్ధ్య సిబ్బందికి ఉచితంగా పంపిణీచేస్తున్నాయి.

 

 

చర్లపల్లి సెంట్రల్‌ జైలు ఖైదీలు తక్కువ ధరకు ప్రజలకు మాస్కులు అందించాలన్న లక్ష్యంతో శానిటైజర్లు, మాస్కులతో కూడిన కిట్ల తయారీపై దృష్టిపెట్టారు. చంచల్‌ గూడ జైలుతోపాటు జిల్లా జైళ్లలోని కర్మాగారాల్లో ప్రత్యేక వస్త్రంతో కూడిన మాస్కులు తయారు చేస్తున్నారు. ప్రతి కిట్‌లో రెండు లీటర్ల బ్లాక్‌ ఫినాయిల్‌ బాటిళ్లు, 300 ఎంఎల్‌ హ్యాండ్‌ శానిటైజర్లు రెండు, రెండు హ్యాండ్‌వాష్‌లు, రెండు సబ్బులు, ఖాదీతో చేసిన 12 మాస్కులతోపాటు ఇతర వస్తువులను ఉంచి రూ.900 చొప్పున విక్రయిస్తున్నట్టు జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది తెలిపారు. ఒకేచోట 15కు మించి కిట్లు ఆర్డర్‌చేస్తే మూడురోజుల్లో డెలివరీ చేస్తామని చెప్పారు. డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా డబ్బు చెల్లించాలని సూచించారు. మాస్కులు నూలు వస్త్రంతో చేసినవి కావడంతో సబ్బుతో ఉతికి, డెటాయిల్‌లో ముంచి ఆరవేసుకుంటే మరలా వినియోగించుకునేందుకు వీలుంటుంది. హైదరాబాద్‌లో కావాల్సినవారు 9866092127, 9494632100 లో సంప్రదించాలని కోరారు.

 


ఇదిలాఉండ‌గా, శానిటైజర్లు, మాస్కులు, మందుల తయారీని ఫార్మా కంపెనీలు వేగవంతం చేశాయి. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఉత్పత్తిని పెంచాయి. వీటిని దవాఖానలు, వైద్య సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, వివిధ ప్రభుత్వశాఖలకు అందివ్వనున్నారు.  చాలా కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: