ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో, వార్డుల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ గ్రామ, వార్డు క్లినిక్స్ భవిష్యత్తులో వ్యాధుల నియంత్రణలో కీలకంగా మారతాయని చెప్పారు. నిన్న సీఎం అధికారులతో గ్రామ, వార్డు క్లినిక్ ల గురించి, పలు అంశాల గురించి సమీక్ష నిర్వహించారు. 
 
2021 మార్చి లోపు గ్రామ, వార్డు క్లినిక్ లు ఏర్పాటు కావాలని... ప్రజారోగ్యానికి వైరస్ లు చేటు చేస్తున్న క్రమంలో గ్రామ, వార్డు క్లినిక్ లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దేశంలో వైరస్ లు వ్యాప్తి చెందుతున్న తరుణంలో క్లినిక్ లు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు .రాష్ట్రంలో ఏర్పాటయ్యే గ్రామ, వార్డు క్లినిక్ లను మ్యాపింగ్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 
 
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో వాటర్ గ్రిడ్ పనులు వెంటనే మొదలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పనుల కొరకు వెంటనే టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ తొలి విడత పనుల్లో భాగంగా రాష్ట్రంలోని కడప, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టాలని తెలిపారు. 
 
జూన్ మొదటి వారంలోపు వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు కావాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ప్రకాశం జిల్లాలో 11 కేసులు నమోదు కాగా గుంటూరులో 2, కడప... తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 363కు చేరింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: