కరోనా ప్రభావం మీడియా రంగంపై కూడా బాగానే ఉందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ పత్రికలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పత్రికల ద్వారా కరోనా వస్తుందన్న భయం ఓవైపు.. లాక్ డౌన్ మరోవైపు పత్రికలను కుంగదీశాయి. ఒక దశలో ఈ లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పత్రికల ముద్రణను తాత్కాలికంగా నిలిపివేస్తే ఎలా ఉంటందున్న చర్చ కూడా జరిగినా.. చివరకు ప్రచురణకే ప్రధాన పత్రికలు మొగ్గు చూపాయి.

 

 

ఇప్పటికే పత్రికల పంపణీ వ్యవస్థ గాడి తప్పింది. జిల్లా ఎడిషన్లు మాయం అయ్యాయి. ఆదివారం అనుబంధాలతో అనుబంధం తీరిపోయింది. కరోనా కష్టకాలంలో రెవెన్యూ దారుణంగా పడిపోయింది. దీంతో మిగిలిన రంగాలను ఆదుకున్నట్టే మీడియాను కూడా మోడీ సర్కారు ఆదుకోవాలంటున్నాయి పత్రికాయాజమాన్యాలు. లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రింట్‌ మీడియాను ఆదుకోవాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

 

 

ఓవైపు ప్రకటనల ఆదాయాలు కోల్పోయి, మరోవైపు ముడి వస్తువుల వ్యయాలు.. న్యూస్‌ప్రింట్‌ దిగుమతి సుంకాలు భారీగా పెరిగిపోయి పత్రికా రంగం కుదేలవుతోందని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ కేంద్రానికి మొర పెట్టుకుంటోంది. తక్షణం మీడియా రంగానికి ప్రత్యేకించి ప్రింట్ మీడియా రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించాలని కోరింది.

 

 

అలాగే.. న్యూస్‌ పేపర్‌ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్‌ హాలిడే ఇవ్వాలని కోరుతోంది. పత్రికలకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల రేటు పెంచాలని.. ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన పాత బకాయిలన్నీ తక్షణమే ఇవ్వాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌కు ఐఎన్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ గుప్తా లేఖ రాశారు. మరి మోడీ సర్కారు కరుణిస్తాడా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: