దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కరోనా భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. 
 
కానీ కృష్ణా జిల్లాలో ప్రేమ పెళ్లికి కరోనా, లాక్ డౌన్ అడ్డు కాలేదు. యువతి లాక్ డౌన్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా 70 కిలోమీటర్లు నడిచివెళ్లి ప్రియుడితో తాళి కట్టించుకుంది. అనంతరం తమకు రక్షణ కల్పించాలని జంట పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మచిలీపట్నం మండలం ఈడేపల్లి గ్రామానికి చెందిన సాయి, హనుమాన్ జంక్షన్ కు చెందిన భవాని గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. 
 
యువతి ఇంట్లో విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ప్రేమికులిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునారు. హనుమాన్ జంక్షన్ నుంచి కాలినడకన బయలుదేరిన యువతి 70 కిలోమీటర్లు నడిచి మచిలీపట్నం చేరుకుంది. అక్కడ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. బుధవారం రోజున వీరి వివాహం జరిగింది. 
 
యువతి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడటంతో చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని నూతన దంపతులు కోరారు. పోలీసులు హనుమాన్ జంక్షన్ నుంచి మచిలీపట్నానికి ఎలా చేరుకున్నావని యువతిని అడగగా నడుచుకుంటూ వచ్చానని యువతి చెప్పిన సమాధానం విని షాక్ కు గురయ్యారు. పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి దంపతులను వారి వెంట పంపించారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ దంపతుల కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: