కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి పోలీసులు చేస్తున్న కృషి అపారం. కష్టకాలంలో వారు రేయింబగళ్లు ఓపికతో విధులు నిర్వహిస్తున్నారు. అయినా కొందరు పనీపాటా లేకపోయినా కుంటి సాకులతో రోడ్లపైకి వస్తూ వారికి విసుగు తెప్పిస్తున్నారు. దీంతో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు.

 

 

సాధారణంగా సౌమ్యంగా మాట్లాడే ఆయన.. తాజాగా గట్టి హెచ్చరికలే చేశారు. పోలీసులు తలచుకుంటే అరగంటలో పరిస్థితిని అదుపులోకి తీసుకొనే శక్తిసామర్ద్యాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకే కాదు రాజకీయ నాయకులకు కూడా సీపీ వార్నింగ్ ఇచ్చారు. భౌతిక దూరం పాటించకుండా జనాన్ని వేసుకుని తిరిగే నేతలపై కూడా కేసులు పెడతామన్నారు.

 

 

పోలీసుల శాంత స్వభావాన్ని చేతగానితనంగా భావిస్తే చర్యలు తీసుకోవడం తప్పదని విజయవాడ సీపీ హెచ్చరించారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇంటిపట్టునే ఉండి ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. సంయమనంతో ప్రజారోగ్యాన్ని కాపాడే పనిలో ఉన్నామని మాటవినకుండా మొండికేస్తే కన్నెర్ర చేయక తప్పదని తిరుమల రావు పేర్కొన్నారు.

 

 

ఇక విజయవాడ నగరంలో కరోనా కేసుల పరిస్థితినీ ఆయన వివరించారు. మొత్తం ఢిల్లీ వెళ్లిన వారు 35 మంది ఉండగా వారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్ వచ్చిందని.. వారితో కాంటాక్ట్ అయిన 10 మందికి కరోనా సోకిందని తెలిపారు. ఢిల్లీ వారితో ప్రైమరీ, సెకండరీ కంటాక్టు అయిన 830 మందిని గుర్తించామని వివరించారు. వీరందర్ని గృహ నిర్బంధంలో ఉంచి నిఘా పెట్టామని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: