దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. కేంద్రం అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్లాల్సిన వాళ్లు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అయితే రైల్వే శాఖ వీరికి శుభవార్త చెప్పింది. కేంద్రం రైలు ప్రయాణాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్ డౌన్ గురించి కేంద్రం నుంచి స్పష్టత రానప్పటికీ రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక సర్వీసులకు అనుమతి ఇచ్చింది. 
 
రైల్వే శాఖ రెగ్యులర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానప్పటికీ ప్రత్యేక సర్వీసుల రూపంలో రైళ్లను నడపాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేలా ప్రణాళిక రూపొందించింది. కానీ రైలులో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 
 
రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులలో నాన్ ఏసీ బోగీలను మాత్రమే అందుబాటులో ఉంచనుంది. ఈ రైళ్లు నాన్ స్టాప్ పద్ధతిలో నడవనున్నాయి. రైల్వే అధికారులకు ప్రయాణికుడు 12 గంటల ముందు ఆరోగ్య స్థితికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.  ప్రయాణం చేసే  సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రయాణికుడిని కిందకు పంపిస్తారు. బెర్త్ ఖరారైన వారికి మాత్రమే రైల్వే అధికారులు అనుమతి ఇస్తారు. 
 
సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించడానికి అర్హులు కాదు. ప్రయాణికులు 4 గంటల ముందు రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూ ప్రయాణికులు ప్రత్యేక మార్గం ద్వారా రావాల్సి ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ అయిన తర్వాత మాత్రమే ప్రయాణికులను రైళ్లలోకి అనుమతిస్తారు. క్యాబిన్ కు ఇద్దరు మాత్రమే ప్రయాణించే విధంగా అధికారులు బెర్తులు కేటాయిస్తారు. అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు ముగిసిన తర్వాత ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రయాణికులకు రైళ్లలో క్యాటరింగ్ సర్వీస్ ఉండదు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: