కరోనా వైరస్‌ తూర్పుగోదావరి జిల్లా రైతులను అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌తో పంటలను కొనే నాథుడే కరువయ్యాడు. ఐతే...ఇది చాలదన్నట్లుగా జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టాల పాలు చేశాయ్. చేలల్లో ఆరబెట్టిన పంటలు కాస్తా నీటి పాలయ్యాయ్. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందకుండా పోయింది. వర్షాల కారణంగా కోతకు సిద్దమైన వరి నేల పాలైంది. ఈదురు గాలులకు అరటి పంట విరిగిపోయింది. కోత కోసిన మొక్కజొన్న పంట వర్షపు నీటిలోనే మునిగిపోయింది. 

 

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులకు కరెంటు సరఫరా నిలిపివేశారు అధికారులు. జిల్లాలో పలుచోట్ల అధిక వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 27 శాతం పంటలు కోయటం పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లో ఇంకా వరి కోతలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే పంట తడిసిపోయి ధాన్యం రంగు మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.  

 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజారవాణా నిలిచిపోవటంతో రైతులు చేతికొచ్చిన పంటలను మార్కెట్‌కు తరలించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అకాల వర్షం కురిసింది. ఇది జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. కోనసీమలోని చాలాచోట్ల కోత దశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి చేలు ఈదురు గాలులకు నేలకొరిగిపోయాయి. వర్షాల కారణంగా వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. లంక ప్రాంతాల్లో సుడులు తిరిగిన గాలి వానకు వరి పంట నేలపాలైంది. మిరప, మెక్కజొన్న, వంగ, బెండ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది.

 

ఇక...ఈదురు గాలుల ప్రభావంతో లంక గ్రామాల్లోని అరటి తోటలు నేలకొరిగాయి. జిల్లాలో సుమారు 4 వేల 5 వందల హెక్టార్లలో అరటి సాగు చేస్తున్నారు రైతులు. ఈ ఏడాది ఆరంభం నుంచి కూడా అరటి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. సీజన్ ప్రారంభం అవుతున్న దశలో కరోనా వ్యాపించింది. కాపుకు వచ్చిన అరటి లాభాలు తెచ్చి పెడుతుందని భావించారు రైతులు. అయితే ఒక్కసారిగా వీచిన పెను గాలులు తీవ్ర దుమారం రేపాయి. వర్షంతో పాటు వీచిన గాలులకు చాలా చోట్ల అరటి చెట్లు నేల కూలాయి. రైతులకు ఎగుమతికి అవకాశం లేకపోవడంతో గెలలు చెట్లకే కుళ్ళిపోతున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అరటి రైతులు.

 

ఐతే...మొక్కజొన్న పంటను కోత కోసి దాచుకుందామని అనుకున్నారు రైతులు. లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటను పండిస్తున్నారు రైతులు. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో పంట తడిసి ముద్దయింది. వర్షం కారణంగా రైతులకు భారీ నష్టాలు వాటిల్లాయి. ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల మేర నష్టం వచ్చినట్లు అంచనా. లంక గ్రామాల్లో వేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి పంటలు కూడా వర్షంతో తీవ్రంగా నష్టపోయాయి.

 

చేతికి వచ్చిన పంట నీటి పాలైందని కోనసీమ రైతులు గగ్గోలు పెడుతున్నారు. అకాల వర్షాలతో అపార నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని  కోరుతున్నారు అన్నదాతలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: