ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోదీ లాక్ డౌన్ ను కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మోదీ 14వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనంతరం లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేయనున్నారు. 
 
కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించినప్పటికీ పలు మార్పులు చేయనుందని తెలుస్తోంది. దేశంలో మరికొన్ని వారాల పాటు విద్యాసంస్థలపై ఆంక్షలు కొనసాగనున్నాయని సమాచారం. కేంద్రం అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించనుందని తెలుస్తోంది. కేంద్రం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రంగాలకు మాత్రం మినహాయింపు ఇవ్వనుందని సమాచారం. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలన్న నిబంధనలను విధించి కేంద్రం మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
లాక్ డౌన్ వల్ల పౌర విమానయాన రంగం తీవ్రంగా నష్టపోవడంతో కేంద్రం ఎయిర్ లైన్స్ ను పునరుద్ధరించనుందని తెలుస్తోంది. అయితే కేంద్రం విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలన్న నిబంధనను తెరపైకి తీసుకురానుందని తెలుస్తోంది. మోదీ ఇటీవల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన సమావేశంలో దేశంలో ఒకేసారి లాక్ డౌన్ ను ఎత్తివేసే పరిస్థితి లేదని అన్నారు. కేంద్రంపై ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం దేశంలో సామాజిక అత్యవసర స్థితితో సమానంగా పరిస్థితి నెలకొందని మోదీ పేర్కొన్నారు. మరోవైపు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగించాలని మోదీని కోరుతున్నాయి. పలు రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ ను ఎత్తివేయాలని... పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో ఆంక్షలు అమలు చేయాలని కోరుతున్నారు. మరి మోదీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు ఆగాల్సిందే. ప్రధాని మోదీ ప్రకటన కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: