ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. కరోనా వైరస్ పెళ్లిళ్ల వాయిదాకు కారణమైంది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జనం ఒకచోట గుమిగూడకుండా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితుల్లో వివాహాలు జరిపించటానికి వీలు లేకుండా పోయింది.  ఏడుకొండల స్వామీ చెంత ఏడు అడుగులు నడవాలనుకున్న జంటలు మరో ఆరు నెలలు ఆగాల్సిందే...దీంతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉండే కోనేటి రాయుడి చెంత కల్యాణాలు లేకపోవడంతో ఎందరో ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. 

 

ప్రపంచ ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి ... నిత్యం గోవింద నామస్మరణలతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంటుంది. స్వామి ఆశీస్సులతో ఒక్కటవుదామనే జంటలతో తిరుపతి, తిరుచానూరు వ్యాప్తంగా వేలాది పెళ్ళిళ్లు జరుగుతుంటాయి. అందుకోసం దాదాపు రెండు వందలకుపైగా ప్రైవేటు కళ్యాణ మండపాలతో పాటు...టీటీడీకి సంబంధించిన కళ్యాణ మండపాలు ఉన్నాయి. 7వేల రూపాయిల అద్దె నుంచి లక్ష వరకు అద్దెలు వసూలు చేస్తుంటారు. ఒక్క ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్నాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామి వారి చెంత ఏడడుగులు నడవడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. సినీతారలు, ప్రముఖుల  వివాహాలకు సైతం వేదికైంది తిరుపతి. 


 
నగరంలో పెళ్ళళ్ళకు,కల్యాణా మండపాలకు కొదవలేదు...పెళ్ళిళ్లను నమ్మకుని వేలాది కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. అయితే కరోనాఎఫెక్ట్ తో  ఫోటో గ్రాఫర్సు మొదలు పురోహితులు, కేటరింగ్, డెకరేషన్, లైటింగ్, సన్నాయి, బ్యాండ్‌ మేళం, మ్యారేజ్‌ ఈవెంట్ల నిర్వాహకులు.. ఇలా అందరూ ఇప్పుడు ఖాళీగా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది.  

 

జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ ఘట్టాన్ని ఆనందంగా జరుపుకోవాలని... వధూవరులు కలకాలం సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో సంప్రదాయబద్ధంగా పెద్దలు ముహూర్తాలు నిర్ణయించారు. ఆమేరకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ కరోనా వారి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

 

లాక్‌డౌన్‌ ప్రభావంతో వివాహాల పరిస్థితి తలకిందులైంది. చాలా మంది వాయిదా వేసుకోగా... మరికొందరు ముహూర్త బలం ముఖ్యమని భావించి సాదాసీదాగానైనా పెళ్లి కానిచ్చేయాలని ఆలోచిస్తున్నారు. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 వివాహాలపై లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. ఇందులో ముహూర్తాలు పెట్టిన తరువాత వాయిదా వేసుకున్నవి ఎక్కువ. మిగతా వారు ముహూర్తాలు కూడా తర్వాత పెట్టుకోవాలని నిర్ణయించారు.

 

జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలల్లో వివాహాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్న వారిపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యేలా చేసింది. దీంతో శుభ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వీటిలో పెళ్లిళ్లు అధికంగా ఉన్నాయి. మరోవైపు శుభకార్యాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది పనులు లేక అవస్థలు పడుతున్నారు. ముందుగానే బుక్‌ చేసుకున్న ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికలను కూడా రద్దు చేసుకుంటున్నారు.

 

సాధారణంగా హిందువులు ఫాల్గుణ, ఛైత్ర, వైశాఖ మాసాల్లో వివాహాలకు సుముహూర్తాలు నిశ్చయిస్తుంటారు. ఏడాది మొత్తమ్మీద ఈ మూడు నెలల్లో 50 వేల నుంచి 60 వేల వరకు పెళ్లిళ్లు జరుగుతాయి.  ఏప్రిల్‌ 4, 8, 9, 11, 14, 16, 17, 30 తేదీలు, మే 1న పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిపించడానికి రెండు, మూడు నెలల ముందే ముహూర్తాలు నిశ్చయించుకున్నారు. కొందరు ఇప్పటికే శుభలేఖలు పంపిణీ చేశారు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.ఇంతలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్‌ 14 తర్వాత ఎలాంటి పరిస్థితులుంటాయో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే నిశ్చయించిన ముహూర్తాల్లో 95 శాతానికి పైగా వివాహాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఏప్రిల్‌ నెలాఖరు లేదా మే నెలలో వివాహాలు జరిపించాలనే ఆలోచనలో కొందరు ఉన్నారు. మే 22 నుంచి జ్యేష్ట మాసం, అనంతరం వచ్చే ఆషాఢ మాసం వివాహాలకు ముహూర్తాలుండవు. ఆగస్టు, నవంబర్‌ నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో చాలామంది అప్పటికి వాయిదా వేసుకుంటున్నారని పురోహితులు అంటున్నారు.

 

 శుభకార్యాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పురోహితులు, కేటరింగ్, డెకరేషన్, లైటింగ్, సన్నాయి, బ్యాండ్‌ మేళం, మ్యారేజ్‌ ఈవెంట్ల నిర్వాహకులు.. ఇలా అందరూ ఇప్పుడు ఖాళీగా ఇంటిపట్టునే ఉంటున్నారు. వారందరికి ఆరు నెలల పాటు బతుకు పోరాటం ఎలా సాగించాలో అర్ధం కాని పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వం తమను అదుకోవాలంటూ వేడుకుంటున్నారు..  నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉండే ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో కల్యాణాలు లేక కళ తప్పింది.   వాటినే నమ్ముకొని బతుకున్న వారికి కన్నీటినే మిగిల్చింది కరోనా వైరస్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: