చిత్తూరు జిల్లా రైతులకు ఎప్పుడూ తీపిని పంచే మామిడి ఈ సారి ఎన్నడూలేని నష్టాలను మిగిల్చింది.  లాక్ డౌన్ కారణంగా చేతికొచ్చిన కొద్దిపంటను అమ్ముకునే పరిస్థితి లేక విలవిల్లాడుతున్నారు. కష్టాల్లో కూరుకుపోయిన తమను,  ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

చిత్తూరు జిల్లాలో వేరుశనగ తరువాత ఎక్కువ మంది రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మామిడిగుజ్జు పరిశ్రమలు ఉంటడంతో ఎక్కువమంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. 

 

ఈ ఏడాది దాదాపు 2 లక్షల 80 ఎకరాల్లో పంట సాగులో ఉంది. ఎక్కువగా తోతాపూరి బెంగళూరు రకం లక్షా నలభై వేల ఎకరాలు, బేనిషా 67వేల 500 ఎకరాల్లో, ఖాధర్ రకం ఐదువేల ఎకరాలు, నీలం ముప్పైవేల ఎకరాల్లో, ఇతర రకాలు ముప్ఫైవేల ఎకరాల్లో మామిడి ఉంది. వీటి ద్వారా నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది. 

 

చిత్తూరు జిల్లాలో పండ్ల పరిశ్రమలు కూడా దాదాపు 60కు పైగా ఉన్నాయి. సుమారుగా ఐదువందల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ప్రస్తుతం 57 మామిడి గుజ్జు పరిశ్రమలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పల్ప్‌ ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. పడమటి మండలాలైన మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, కలికిరి,పుంగనూరు, పలమనేరు,పీలేరు, బంగారుపాళ్యెం మండలాల్లో  వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో మన చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత ఉంది. అందుకే రుచిలో చిత్తూరు మామిళ్లకు ఏవీ సాటి రావనే నానుడి ఉంది.


 
అయితే ఈ సారి జిల్లాలో  మామిడి రైతులకు గడ్డు పరిస్థితి తలెత్తింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పూత రాలిపోతోంది. దీంతో ఈసారి దిగుబడులు భారీగా పడిపోయే పరిస్థితి నెలకొని ఉందని ఉద్యానశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో అకాల వర్షాలు కురవడం, తర్వాత చలి నెలకొనడం తదితర కారణాల వల్ల ఈసారి పూత రావడమే ఆలస్యమైందని, ప్రస్తుత వాతావరణం కూడా పూత, పిందెలు నిలబడే స్థితి లేకుండా పోయిందని అధికారులు అంటున్నారు. 

 

సగటున ఎకరాకు ఐదారు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఆ స్థాయిలో దిగుబడులు రావడం లేదు. తేనె మంచు పురుగు మామిడి పూత పుష్ఫగుచ్చాల్లోని తియ్యటి రసం పీల్చడంతో పూత పట్టు కోల్పోయి రాలుతోంది. పూత రాలిపోవటం,మామిడి కాయలపై బంక కారిపోతుంది.నల్ల మచ్చలు కాయలపై రావడంతో గెలల్లో నుంచి పిందెలు పండిపోయి రాలిపోతున్నాయి. ఏ తెగులు వచ్చిందో తెలియక, ఏ మందు పిచికారీ చేయాలో అర్థంకాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. 

 

ఏ చీడపీడలు నాశనం చేయనంత విధంగా కరోనా రైతులను పూర్తిగా ముంచేసింది. మార్చి 20 తరువాత మార్కెట్లోకి మామిడి ఎగుమతులు సాధారణంగా జరుగుతుంటాయి. కచ్చితంగా అదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కరోనా భారతదేశంపైన విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా విజృంభించడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించింది. కూలీలు సైతం పనిచేసుకోలేని విధంగా ఆంక్షలు వచ్చాయి. ఇక మార్కెట్లు తెరుచుకోలేదు. దేశ వ్యాప్తంగా వచ్చిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఢిల్లీసేట్లు రాలేని పరిస్థితి. 

 

జాతీయ స్థాయిలో రైళ్లు అంతర్జాతీయ స్థాయిలో విమానాల్లో జిల్లా మామిడి ఎగుమతులు జరుగుతుంటాయి. రైళ్లు విమానాలు పూర్తిగా రద్దు చేయడంతో ఎటుపాలుపోని విధంగా వేదనకు గురవుతున్నారు రైతులు. చేతికి వచ్చిన పంటను ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో రైతాంగం ఉంది. ఈ ఏడాది ఎంతోకొంత నాణ్యమైన కాయలు వచ్చాయి. అయితే కరోనాతో ప్రపంచం బెంబేలేత్తడంతో కొనేవారు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాస్తా కూస్తో రైతులు పండించిన పంటలను బయటి మార్కెట్లకు తరలించి అమ్ముకునే పరిస్థితి సన్నగిల్లుతుంది. జిల్లాలోనూ, ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. అయితే రవాణా చేయడానికి వాహన డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో పంటపొలాల్లోనే పంటను వదిలేసే పరిస్థితి నెలకొంది. 

 

కరోనా ప్రభావంతో అటు వాహనాల డ్రైవర్లు, ఇటు దినసరి కూలీలు రాకపోవడంతో పంటలు చెల్లోలోనే వదిలేస్తున్నారు.అటు పంటను కొనేవాళ్ళు లేక ఇటు స్వయంగా రవాణా చేసుకోలేక రైతు తీవ్రనష్టాలతో మునిగిపోతున్నారు.


 
మరో నెల రోజుల్లో పూర్తిగా పంట వచ్చిన వాటి సరైన మద్దతు ధర వస్తుందోరాదో అన్న భయాందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది. వచ్చిన పంటకు.. మార్కెట్ ధరకు తోడు మామిడి గుజ్జు పరిశ్రమలు ఎలా స్పందిస్తాయి అన్న అనుమానాలు రైతుల్లో నెలకొన్నాయి.మొత్తానికి ఎప్పుడూ జిల్లా రైతులకు తీపిని మిగిల్చే మామిడి, ఈ సారి ఎన్నడులేని నష్టాలను మిగులుస్తోందంటున్నారు రైతులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: