వెంటిలేటర్‌..! ఇప్పుడిదే ప్రపంచ దేశాలకు ప్రాణాధారం. కరోనా సోకి వేలాది మంది పిటల్లారాలి ప్రాణాలు కోల్పోవడానికి వెంటిలేటర్ల కొరతే ప్రధాన కారణం. అమెరికా, స్పెయిన్‌, ఇటలీ వంటి అగ్రరాజ్యాల్లోనూ వెంటిలేటర్లు సరిపడా లేవు. మరి కరోనా రక్కసి భారత్‌లోనూ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో... మన పరిస్థితేంటి? 

 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేలాది మంది  ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మరణాలు పెరిగేందుకు ప్రధాన కారణాల్లో వెంటిలేటర్ల కొరత ఒకటి.  సంపన్న దేశాలు.. అగ్రరాజ్యాల్లో సైతం... వెంటిలేటర్ల కొరత ఉంది.  మరి అభివృద్ధి చెందుతున్న దేశమైన మన భారత్‌లో కరోనా బాధితులు పెరిగితే..వెంటిలేరట్ల కొరత తీవ్రసమస్య కానుంది.

 

ఎంత పెద్ద ఆస్పత్రి అయినా... వెంటిలేటర్లు కొంతమాత్రంగానే ఉంటాయి. అత్యవసర చికిత్స అవసరమున్న వారికే వెంటిలేటర్లు వాడుతుంటారు. వెంటిలేటర్లు లేక... ఎమర్జెన్సీ కేసుల జోలికి వెళ్లని ఆస్పత్రులూ ఉన్నాయి.  క్షణాల్లో ప్రాణం పోతున్న వ్యక్తికి సైతం కడసారిచూపుకు ఉంచేలా చేస్తుంది కూడా వెంటిలేటరే. 

 

కరోనా వైరస్‌ సోకుతున్న వారిలో ముఖ్యంగా వస్తున్నవి శ్వాసకోస సమస్యలు.  వారందరికీ వెంటిలేటర్‌ తప్పనిసరి. అంటే కరోనా రక్కసి నుంచి మనదేశం బయటపడాలంటే.. వెంటిలేటర్ల కొరతను అధిగమించాలి. అప్పుడే కరోనా సోకిన వారిని కాపాడగలం. ఆంధ్రప్రదేశ్‌లో 400 వెంటిలేటర్లు ఉండగా... కరోనా విపత్తుతో మరో వంద వెంటిలేటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు తక్కువ ధరకే వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు.. ఎయిమ్స్‌ డిజైన్‌ చేసిన వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తోంది జగన్‌ సర్కార్‌. కేవలం లక్షా 90 వేల రూపాయలకే ఈ వెంటిలేటర్లు లభించనున్నాయి.

 

మనదేశం లో వైరస్‌ విజృంభిస్తే తగినన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చేలా ఐఐటీ హైదరాబాద్‌ ముందుకొచ్చింది. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లడంతోపాటు బ్యాటరీతో పనిచేసే ప్రోటోటైప్‌ నమూనాను ఐఐటీహెచ్‌లోని ఆంట్రపెన్యూర్‌ సంస్థ ఏరోబయోసిస్‌ సిద్ధం చేసింది. కేవలం 12 రోజుల్లోనే తయారు చేసిన ఈ వెంటిలేటర్‌కు జీవన్‌లైట్‌గా నామకరణం చేశారు.

 

లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేసే ఈ వెంటిలేటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 5 గంటలపాటు వాడుకోవచ్చంటున్నారు.  ఇందులో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ టెక్నాలజీని వాడారు. దీనివల్ల బాధితుల శ్వాసకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాక్టర్లు.. తమ మొబైల్‌ లో యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేయొచ్చు.

 

ప్రస్తుతం వాడే వెంటిలేటర్‌ తయారీ ధర 9 లక్షల రూపాయల నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ... ఐఐటీ హైదరాబాద్‌లోని ఏరోబయోసిస్‌ సంస్థ తయారు చేస్తుంది మాత్రం కేవలం లక్ష రూపాయల్లోనే. తయారీదారులు ముందుకొస్తే ఈనెలాఖరుకే మార్కెట్లోకి తెస్తామని... ఆ దిశగా కొన్ని సంస్థలతోనూ చర్చించినట్లు ఏరోబయోసిస్‌ చెప్తోంది. తయారీదారులు ముందుకొస్తే రోజుకు 50 నుంచి 70 వరకు ఉత్పత్తి చేయవచ్చంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: