ఏపీలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ విషయంలో  సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన నియామక అర్హత నిబంధనాలపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, దాన్ని గవర్నర్ చేత ఆమోదముద్ర వేయించుకుని, ఈసీ రమేష్ కుమార్ పదవీకాలం మూడేళ్లకు కుదించింది.

 

దీంతో ఐదేళ్లు కొనసాగాల్సిన రమేష్ పదవీకాలం మూడేళ్లకు పడిపోయింది. ఇక ఇప్పటికే ఆయన పదవికిలోకి వచ్చి మూడేళ్లు కావడంతో ,ఆయనని పదవి నుంచి తొలగించేశారు. అయితే రమేష్ పై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కారణం లేకపోలేదు. మార్చిలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలని, కరోనా ప్రభావంతో రమేష్ కుమార్ తనకున్న విచక్షణ అధికారాల్ని ఉపయోగించి ఆరు వారాలు పాటు వాయిదా వేశారు.

 

ఇక ఈ నిర్ణయం జగన్ ప్రభుత్వానికి నచ్చలేదు. అప్పుడు కరోనా ప్రభావం లేకపోయినా, తమని సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారంటూ జగన్ తో సహా వైసీపీ నేతలు రమేష్ కుమార్ పై మండిపడ్డారు. రమేష్, చంద్రబాబు  సామాజికవర్గానికి చెందిన వారు కాబట్టి, టీడీపీ లైన్ లో ఉండి ఎన్నికలు వాయిదా వేశారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే కరోనా వ్యాప్తి పెరగడంతో, ఆ వ్యవహారం పక్కకు వెళ్ళిపోయింది. కానీ కరోనాతో ఓ వైపు పోరాటం చేస్తున్న సమయంలోనే వైసీపీ ప్రభుత్వం సైలెంట్ గా రమేష్ కుమార్ ని పక్కకు తప్పించేసింది.

 

ఇక దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీ నారాయణ, సీపీఐ రామకృష్ణ లాంటి ప్రతిపక్ష నాయకులంతా రంగంలోకి దిగేసి, రమేష్ ని ఎలా తప్పిస్తారంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.పైగా కరోనా విజృంభిస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని అన్నారు. రమేష్‌ కుమార్‌ను మార్చేందుకు దొడ్డిదారిన సవరణలు చేశారని చంద్రబాబు విమర్శించారు. అటు పవన్ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న సామెతలా సాగుతోంది ప్రభుత్వ వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. మరి ప్రతిపక్షాలు రమేష్ కుమార్ వ్యవహారంలో ఇంత ఘాటుగా స్పందిస్తున్న , నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చే పనిచేస్తున్నారు.

 

గవర్నర్ రాజ్యాంగ బద్ధంగానే సవరణ తీసుకొచ్చారని దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. మరి చూడాలి ఈ ఎలక్షన్ కమిషనర్ వ్యవహారంపై రచ్చ ఇంకెంత ముదురుతోందో

మరింత సమాచారం తెలుసుకోండి: