లాక్‌డౌన్ పుణ్యాన‌.. మ‌నం అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వింటున్నాం. మ‌రింత ఆక‌ట్టుకునే దృశ్యాల‌ను చూస్తున్నాం. పంజాబ్‌లోని జ‌లంధ‌ర్ నుంచి సుమారు రెండు వంద‌ల‌కుపైగా కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హిమాల‌య‌ప‌ర్వ‌తాలు కూడా క‌నిపిస్తూ క‌నువిందు చేస్తున్నాయి. ఇక దేశంలో గంగా, న‌ర్మాదా త‌దిత‌ర న‌దుల నీళ్ల‌న్నీ ఎంతో ప‌రిశుభ్రంగా ఉంటున్నాయి. న‌దుల నీళ్లు తెల్ల‌గా మెరిసిపోతున్నాయి. వాతావ‌ర‌ణంలో కాలుష్యం భారీ స్థాయిలో త‌గ్గిపోతుండ‌డం వ‌ల్లే ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయి మ‌రి. ఇక భూతాపంలోనూ గ‌ణ‌నీయ‌మైన‌ మార్పులు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. ఒక్క‌వాహ‌నం కూడా రోడ్డుపైకి వ‌చ్చింది లేదు..ప‌రిశ్ర‌మ‌లు వ్య‌ర్థాల‌ను విడుద‌ల చేసిందీ లేదు. అంతా ప్ర‌శాంతం.. భూ వాతావ‌రణం ఊపిరిపీల్చుకుంటున్న‌ది. అయితే.. క‌రోనా వైర‌స్ మ‌న ప్రాణాల‌ను తీస్తుంద‌న్న‌ది ఒక్క‌టే భ‌యంగానీ.. కాలుష్యం పెరిగిపోతుంద‌ని, త‌గ్గించేందుకు అన్నిదేశాలు క‌లిసిక‌ట్టుగా కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఎన్నో ఏళ్లుగా ప‌దేప‌దే స‌మావేశాలు పెట్టుకోవ‌డం.. ఆ త‌ర్వాత గాలికి వ‌దిలేయ‌డం.. మ‌నందరికీ తెలిసిందే. కానీ.. క‌రోనా దెబ్బ‌కు ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం తేట‌గా మారిపోయింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

మ‌న‌దేశ రాజ‌ధాని ఢిల్లీ, త‌దిత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో అయితే.. వాహ‌నాలు విడుద‌ల చేసే పొగ‌తో, శ‌బ్దంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకోలేని ప‌రిస్థితి. ఇక‌ ఢిల్లీ ప్ర‌భుత్వం అనేక మార్లు కాలుష్య నివార‌ణ‌కు ప‌లు నిబంధ‌న‌లుకూడా తీసుకొచ్చింది. అయినా ఏం లాభం లేకుండా పోయింది. కానీ..లాక్‌డౌన్ వ‌ల్ల ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టుగా ఉంది ఇప్పుడు.. ఓ వైపు క‌రోనా వ్యాప్తికి అడ్డుక‌ట్ట‌ప‌డుతోంది..మ‌రోవైపు వాయు, శ‌బ్ద కాలుష్యం పూర్తిస్థాయిలో త‌గ్గిపోయింది. నిజానికి.. ప్ర‌తీ ఏడాది కాలుష్యంతో కొన్ని ల‌క్ష‌ల మంది శ్వాస‌సంబంధిత జ‌బ్బుల బారిన‌ప‌డుతున్నారు. అదే స్థాయిలో మ‌ర‌ణాలుకూడా సంభ‌విస్తున్నాయి. ఒక‌ర‌కంగా చెప్పుకోవాలంటే.. క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాల క‌న్నా.. కాలుష్య మ‌ర‌ణాలే ప్ర‌తీ ఏడాది ఎక్కువ‌గా చోటుచేసుకుంటున్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దీనికి సంబంధించిన లెక్క‌లుచెప్ప‌డం కొంత‌ క‌ష్ట‌మేగానీ.. ఒక అంచ‌నా వేయ‌డం మాత్రం సుల‌భ‌మేన‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌తీ ఏడాది కూడా ప‌రిమిత రోజులపాటు లాక్‌డౌన్ పాటించ‌డం మేల‌ని త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: