ఏపీలోని కర్నూలు జిల్లాను కరోనా గజగజా వణికిస్తోంది. నిన్నటివరకూ జిల్లాలో 77 కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు మరో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ జిల్లాలో 5 కొత్త కేసులు నమోదైనట్లు ప్రకటన చేశారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 82కు చేరింది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి కుటుంబ సభ్యులకే కరోనా నిర్ధారణ అయిందని కలెక్టర్ తెలిపారు. 
 
జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలోని 22 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు జిల్లాలో నమోదయ్యాయి. నిన్న జిల్లాలో రెండు కేసులు నమోదు కాగా ఈరోజు 5 కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు కరోనా పేరు వినబడితే భయాందోళనకు గురవుతున్నారు. 
 
స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతూ కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు.ఈరోజు 5 కేసులు నమోదు కాగా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో పోలీసులు ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మెడికల్ షాపులు, ఆస్పత్రులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు. 
 
ప్రభుత్వమే రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నిన్న 16 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా పాజివిట్ కేసుల సంఖ్య 381కు చేరింది. ఈరోజు కర్నూలు జిల్లాలో 5 కేసులు నమోదు కాగా ఇతర జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా భారీన పడి ఆరుగురు మృతి చెందారు.          

మరింత సమాచారం తెలుసుకోండి: