కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కొరకై భారతదేశ ప్రభుత్వం మూడు వారాల పాటు లాక్ డౌన్ విధించగా... వృత్తిరీత్యా వలస కూలీల అయిన లక్షల మంది ప్రజలు ఉపాధి లేక, తిండి లేక ఆశ్రమం లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నేతలు లాక్ డౌన్ పొడిగించాలంటూ చెబుతున్నారే తప్ప... దాని కారణంగా రోడ్లమీద ఆహార పొట్లాల కోసం దయనీయంగా బిక్షం ఎత్తుకుంటున్న వారికి ఎటువంటి సాయం చేయడం లేదు. నగదు, రేషన్ బియ్యం ఇస్తానని చెప్పడం... తీరా చూసేసరికి అవన్నీ నెరవేర్చకపోవడం రాజకీయ నేతల వంతయింది. దీంతో ఆకలి తట్టుకోలేక వలస కూలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే తాము ఎంతో కష్టపడ్డామని... లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే ఊరుకోబోమని ప్రస్తుతం ప్రతి ఒక్క కూలి హెచ్చరిస్తున్నాడు.


ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లోని వలస కార్మికులు ఏకంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈరోజు నరేంద్ర మోడీ లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనే అంశంపై తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్న సందర్భంలో వీళ్ళు రోడ్ల మీదకి గుంపులుగుంపులుగా విచ్చేసి కనిపించిన షాపింగ్ మాల్స్, దుకాణాలపై బీభత్సంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలాగే ఓ 70 మంది కార్మికులను పట్టుకొని స్టేషన్ కి తీసుకు వెళ్లారు.


ప్రతి న్యూస్ ఛానల్ లో మే, జూన్ నెలల వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతుండడంతో... తమ భవిష్యత్ ఎంత దారుణంగా మారుతుందో అనే ఊహతో భయపడి రాళ్ల దాడికి ఒడిగట్టినట్టు వలస కార్మికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో రోజువారి కూలీలు బియ్యాన్ని తరలిస్తున్న వాహనాల వెంటపడి బియ్యం బస్తాలను తస్కరిస్తున్నారు. లాక్ డౌన్ చాలా రోజుల వరకు పొడిగిస్తే మాత్రం... కూలీలు హింసాత్మక చర్యలకు కచ్చితంగా పాల్పడతారని చాలామంది ప్రముఖులు అంచనావేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: