కరోనా కరాళ నృత్యానికి... ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా బలయ్యారు. వారం కిందటి దాకా 50 వేలు మాత్రమే ఉన్న మృతుల సంఖ్య... 8 రోజుల వ్యవధిలోనే రెట్టింపు కావడం... వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్ని భయపెడుతోంది. ఇక బాధితుల సంఖ్య కూడా 17 లక్షలకు చేరువలో ఉంది.

 

వైరస్‌ ప్రభావం మొదలై వంద రోజులు దాటిందో లేదో... దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిపోయింది. తొలి నాళ్లలో చైనాకే పరిమితమైన వైరస్‌ తర్వాత మెల్లగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి... మానవాళి మొత్తాన్ని కబళించడం ప్రారంభించింది. ఏప్రిల్‌ 2 నాటికి ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వల్ల 50 వేల మరణాలు సంభవిస్తే... ఏప్రిల్‌ 10 నాటికి... అంటే కేవలం 8 రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య రెట్టింపు కావడం... ఇపుడు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్ని వణికిస్తోంది.

 

కరోనా బారినపడి అత్యధిక మంది ప్రజల్ని పోగొట్టుకున్న దేశాల్లో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. అక్కడ మొత్తం మరణాల సంఖ్య 19 వేలకు చేరువలో ఉంది. లాక్‌డౌన్‌ విధించే నాటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో... వైరస్ సోకిన జనం పిట్టల్లా రాలిపోవడం మొదలైంది. అక్కడ సుమారు లక్షన్నర పాజిటివ్‌ కేసులు నమోదైతే... వారిలో ఏకంగా 19 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ సోకిన వారు రోజూ వందల సంఖ్యలో చనిపోతుంటే... మృతదేహాల్ని ఎలా ఖననం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితుల్లో ఇటలీ ఉంది. 

 

ఇక ఇటలీ తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది అమెరికాలోనే. అక్కడ కరోనా మృతుల సంఖ్య 18 వేలు దాటింది. ఒక్క న్యూయార్క్‌లోనే దాదాపు 8 వేల మంది చనిపోయారు. గత మూడు రోజుల్లోనే 5 వేల మందికి పైగా అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య కూడా 5 లక్షలకు చేరువలో ఉంది. 

 

స్పెయిన్‌లోనూ కరోనా వైరస్‌ మరణ మృదంగం మోగిస్తోంది. ఆ దేశంలో ఇప్పటికి 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా లక్షా 60 వేలకు చేరువలో ఉంది. రోజూ వందల సంఖ్యలో వైరస్‌ సోకిన వారు ప్రాణాలు కోల్పోతుంటే... రోగుల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అక్కడి ప్రభుత్వం విలవిల్లాడుతోంది. 

 

ఫ్రాన్స్‌లోనూ కరోనా మృత్యు ఘోష ఆగడం లేదు. వైరస్ సోకిన లక్షా పాతిక వేల మందిలో... ఇప్పటికే 13 వేల మందికి పైగా చనిపోయారు. బాధితుల్లో రోజూ సగటున వెయ్యి మంది వరకూ ప్రాణాలు కోల్పోతుండటంతో... ఫ్రాన్స్‌ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. 

 

ఇటలీ, అమెరికా, స్పెయిన్‌, ఫ్రాన్‌ తర్వాత... కరోనా మరణాలు ఎక్కువ సంభవించిన దేశాల్లో బ్రిటన్‌ ఉంది. అక్కడ 73 వేల మందికి పైగా వైరస్‌ సోకితే... ఇప్పటికి సుమారు 9 వేల మంది చనిపోయారు. శుక్రవారం ఒక్కరోజే దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

ప్రపంచవ్యాప్తంగా కరోనాకు బలైన లక్ష మందిలో... ఇటలీ, అమెరికా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ నుంచే 77 వేల మంది ఉన్నారు. అంటే... కరోనా దెబ్బకు ఈ ఐదు దేశాలూ ఏ స్థాయిలో విలవిల్లాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: