దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మహమ్మారి ప్రభావంతో ఆర్ధిక రాజధాని విలవిలలాడుతుంటే.. దానికి తీసుపోనట్టుగా ఢిల్లీలోనూ కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇండియాలో వైరస్ సమూహ వ్యాప్తి చెందడం లేదని ప్రకటించింది W.H.O. మరోవైపు లాక్‌డౌన్‌పై కేంద్ర నిర్ణయాన్ని ప్రకటించనున్నారు ప్రధాని మోడీ.

 

ప్రపంచంతో పాటు భారత్‌లో కూడా కరోనా కోరలు చాస్తోంది. శుక్రవారం దేశంలో కొత్తగా 678 కేసులు నమోదవగా.. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,761కి చేరుకుంది. మహమ్మారి సోకినవారిలో 206 మంది మృతిచెందగా.. 516 మంది కోలుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటిలేటర్లు, పీపీఈలు, కిట్లకు కస్టమ్స్‌ డ్యూటీని మినహాయించింది. దేశంలో మొత్తం 146 ప్రభుత్వ ల్యాబ్‌లు, 67 ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు జరిపేలా చర్యలు తీసుకుంది. పీపీఈల తయారీ కోసం 33 సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, రెండు నెలల్లో 49వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్‌లు ఇచ్చినట్టు తెలిపింది కేంద్రం.

 

కరోనా ప్రభావం దేశంలోనే అధికంగా మహారాష్ట్రపై చూపిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే అక్కడ 229 కేసులు నమోదు కావడంతో.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,364కి చేరింది. దేశవ్యాప్తంగా వైరస్‌ బారినపడి 206 మంది మరణించగా.. కేవలం మహారాష్ట్రలోనే 97మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ముంబై నగరం విలవిలలాడుతోంది. మహా నగరంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 993కి చేరగా.. మృతుల సంఖ్య 64కి చేరింది.

 

ఆర్ధిక రాజధానితో పాటు దేశ రాజధానిపై కూడా కరోనా పంజా విసురుతోంది. ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 898 కేసులు నమోదు కాగా.. 13 మంది మృతిచెందారు. అలాగే, తమిళనాడులోనూ కరోనా స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 834 కేసులు నమోదయ్యాయి. వారిలో 21 మంది కోలుకోగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, దేశంలో తొలి కేసు నమోదైన కేరళలో కరోనా వైరస్‌ కేసులు అదుపులోకి వచ్చినట్టే కనబడుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో  357 కేసులు నమోదు కాగా.. 96 మంది కోలుకున్నారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.

 

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది పంజాబ్ ప్రభుత్వం. ఏప్రిల్‌ 30  వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. పంజాబ్‌లో ఇప్పటివరకు 132 కరోనా కేసులు నమోదవగా.. 11 మంది మృత్యువాతపడ్డారు. ఒడిశా సర్కార్‌ కూడా ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడకుండా.. దేశవ్యాప్తంగా 14.3 లక్షల మంది వలస కార్మికులకు ఆవాసం కల్పించామని ప్రకటించింది కేంద్రం. 37 వేల 9 వందల 78 సహాయ శిబిరాల్లో వారంతా ఆవాసం పొందుతున్నారు. ఇవికాక, 16.5 లక్షల మంది కార్మికుల కోసం స్వయంగా యాజమాన్యాలే క్యాంపులు నిర్వహించాయని తెలిపింది కేంద్ర హోంశాఖ.

 

కరోనాపై దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌. కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. వ్యాక్సిన్ల తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం సాగిస్తున్నాయని.. ప్రజలు సైతం ఈ పోరాటంలో సహకరిస్తున్నారన్నారు. కరోనాకు సరిహద్దులంటూ ఏమీ లేవని.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. మాస్కులు ధరించడం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు.

 

ఇక, కరోనా వార్డుల్లో పనిచేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొమ్మిది మంది స్పెషలిస్ట్‌ వైద్యులు, 34 మంది జీడీఎంవోలు, 77 మంది నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, ఏడుగురు ల్యాబ్‌ అసిస్టెంట్లు, 77 ఆస్పత్రి అటెండెంట్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే,  సెంట్రల్‌ హాస్పిటల్‌, లాలాగూడ, సికింద్రాబాద్‌ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు వీరిని నియమించనున్నారు. ఆన్‌లైన్‌లో ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 

 

మరోవైపు.. భారతదేశంలో సమూహవ్యాప్తి లేదని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దేశంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అయితే, భారత్‌లో ఇప్పుడిప్పుడే విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని సంచలన ప్రకటన చేసింది ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసర్చ్‌. గతకొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల్లోని రోగులపై రాండమ్‌ శాంప్లింగ్‌ పరీక్షలు నిర్వహించిన ఐసీఎంఆర్‌ తాజాగా ఫలితాలను వెల్లడించింది. ఆ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం మన దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పింది.

 

ఇక, కరోనా మహమ్మారి  కోరలు చాస్తోన్న వేళ దాని కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ మంగళవారంతో ముగియనుంది. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పొడిగించడమే మంచిదని ఇటివలే పార్లమెంటరీ పార్టీల నేతలు ప్రధానికి తెలపడంతో.. ఇవాళ ఆయన ఏం ప్రకటిస్తారోనని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: