ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఓపీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఓపీ సేవలు ఆగిపోయాయి. రాష్ట్రంలోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఓపీ సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
 
ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఏపీ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు ఓపీ సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఆస్పత్రులు ప్రత్యేక ప్రవేశ మార్గాల ద్వారా రోగులకు ప్రవేశం కల్పించాల్సి ఉంటుంది. 
 
రాష్ట్రంలో ఈరోజు వరకు 386 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటివరకూ రాష్ట్రంలో 381 కేసులు నమోదు కాగా ఈరోజు కర్నూలు జిల్లాలో 5 కరోనా కేసులు నమోదైనట్లు కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ప్రకటన చేశారు. ఈరోజు మిగతా జిల్లాలలో నమోదైన కేసుల వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో 133 రెడ్ జోన్లను ప్రకటించింది. ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.            
 

మరింత సమాచారం తెలుసుకోండి: