కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా తల్లకిందులవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ రోజూ వేల సంఖ్యలో కరోనా కాటుకు బలవుతున్నారు. అలా బలవుతున్న వారిలో దురదృష్టవశాత్తూ మన ఎన్నారైలూ ఉంటున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి పంజాకు దెబ్బకు మరణిస్తున్నవారిలో ప్రవాస భారతీయుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

 

 

నిన్న మొన్నటి వరకూ అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య పదికే పరిమితంగా కాగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సంఖ్య 40దాటుతోంది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్ , న్యూజెర్సీ వంటి ప్రాంతాలలో ఎన్నారైలు అధికంగా ఉన్నారు. వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భారతీయ సంఘాలు అందిస్తున్న సమాచారాం ప్రకారం మరణించిన వారిలో 17 మంది కేరళవాసులు ఉన్నారు.

 

 

మరణించిన వారిలో మరో 10 మంది గుజరాత్ వారు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వారు, ఒకరు ఒడిశాకు చెందినవారని భారతీయ సంఘాలు చెబుతున్నాయి. అయితే దాదాపు వీరంతా 60 ఏళ్లు దాటినవారేనట. ఒకే ఒక్కరి వయస్సు 21 ఏళ్లుగా చెబుతున్నారు. చనిపోయిన వారిలో సున్నోవా అనలైటికల్ సీఈఓ హన్మంతరావు మారేపల్లి, న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త 75 ఏళ్ల చంద్రకాంత్ అమిన్, 60 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

ఇక మరో 1500 మంది ఎన్నారైలు ఇప్పటికే కరోనా బారిన పడి ఉన్నారట. వారంతా ఆస్పత్రులలో చికిత్స చేయించుకుంటున్నారు. అమెరికాలో రోజూ కొన్ని వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 20 వేలు దాటింది. ఈ సంఖ్య లక్షకు చేరుకోవచ్చని అమెరికా అధ్యక్షుడే చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: