మన రాజాసింగ్ తెలుసు కదా.. తెలంగాణలో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే.. కరడు గట్టిన హిందూవాదిగా ముద్ర పడిన వ్యక్తి.. అందుకే తరచూ వివాదాల్లో కనిపిస్తూ ఉంటారు. కేసీఆర్ సర్కారును ఎండగట్టడంలో ముందుంటారు. ఆయన తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి అలాంటి ఇలాంటి కాదు.. ఏకంగా ఓ అంతర్జాతీయ వివాదంలోకే వెళ్లారు.

 

 

మొన్నటికి మొన్న కరోనాపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అంతా రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాజాసింగ్ కూడా దీపాలు వెలిగించారు. ఆ సమయంలో రాజాసింగ్ చైనీస్ వైరస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ విషయంపై ఏకంగా చైనా దేశం స్పందించింది. అదేంటి హైదరాబాద్ లో రాజా సింగ్ నినాదాలు ఇస్తే చైనా కూడా రియాక్టయ్యిందా అంటారా.. ?

 

 

అవును మరి.. మనవాడు చేసిన నినాదాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దీంతో ఈ విషయం కాస్తా ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి చేరింది. దానిపై చైనా కౌన్సిల్ లియూ బింగ్ ఒక లేఖను రాజాసింగ్ కు పంపించారు. అసలు కరోనా వైరస్ గురించి ప్రపంచానికి నివేదించిన తొలి దేశమే చైనా.. అలాగని దీని అర్థం ఈ వైరస్ చైనా నుంచి పుట్టిందని కాదు అంటూ ఆయన తన లేఖలో రాజా సింగ్‌ కు వివరించారు.

 

 

మీరు కరోనాను చైనీస్ వైరస్ అంటూ కామెంట్ చేయడం ఏమీ బాగోలేదు అంటూ లియూ బింగ్ తన లేఖలో పేర్కొన్నారు. చైనీస్ వైరస్ గో బ్యాక్ అన్న మీ నినాదాన్ని ఖండిస్తున్నామని లేఖలో బింగ్ తెలిపారు. అయితే మాత్రం మన రాజా సింగ్ ఊరుకుంటాడా.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. నేనే కాదు.. అమెరికా అద్యక్షుడు ట్రంప్ కూడా చైనీస్ వైరస్ అనలేదా అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి మనోడి ఖ్యాతి చైనా వరకూ వెళ్లిందన్నమాట. రాజా సింగా మజాకా.. మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: