ఓవైపు కరోనా మహమ్మారి కర్కశంగా ప్రాణాలు కబలిస్తోంది. చిన్నా పెద్దా, రాజూ పేద తేడా లేకుండా ప్రజల ప్రాణాలు తీస్తోంది. సైలంట్ కిల్లర్‌గా జనంలో ప్రబలుతోంది. దీని దెబ్బకు లోకమంతా ఇంట్లోకి దూరేసి తాళం వేసుకున్న పరిస్థితి. లాక్‌డౌన్‌ ల దెబ్బతో ప్రభుత్వాలే ఆర్థికంగా కుదేలవుతున్నాయి. నిరుపేదల ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్నాయి.

 

 

ఇలాంటి సమయంలో మనసున్న మారాజులు, పారిశ్రామిక వేత్తలు తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఏపీ సర్కారుకు పలువురు విరాళాలు అందించారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం తమ వంతు సాయంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ జె.రంజిత్‌రావు రూ.3 కోట్లు విరాళం అందించారు.

 

 

ఇక.. మెడికవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ కోటి రూపాయలు, రెయిన్‌ బో హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల కోటి రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు. నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ తరఫున ఎండీ సి.శ్రీధర్‌ కోటి రూపాయలు అందించారు. ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నిధుల నుంచి రూ.30 లక్షలు కరోనా నివారణ చర్యల కోసం విడుదల చేశారు.

 

 

విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ఒక నెల గౌరవవేతనం, ఆ బ్యాంక్‌ ఉద్యోగుల ఒక రోజు జీతం, విశాఖ డీసీసీబీ రూ.13 లక్షలు, విశాఖ జిల్లాలో 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సమకూర్చిన రూ.9 లక్షలు ఇలా మొత్తం తరఫున రూ.25 లక్షలు అందించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండల పరిధిలోని డోకిపర్రు వద్ద ఉన్న జోసిల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాగర్లమూడి మురళీమోహన్‌ రూ.25 లక్షలు అందించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన కాటన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన యోగి వేమారెడ్డి సమితి లక్ష రూపాయలు అందించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: