ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. దేశంలో అత్యధిక కేసులు ముంబైలోనే నమోదవుతున్నాయి. కరోనా కోరల్లో చిక్కుకున్న ముంబై నగరాన్ని రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

 

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గురువారం నాటికి 1380 కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా ఇక్కడ 229 కేసులు నమోదయ్యాయి. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు బుధవారం 150 కేసులు నమోదు కాగా 18 మంది చనిపోయారు. దేశంలో కేసుల సంఖ్యలోకానీ, మరణాల సంఖ్యలో కానీ ఇప్పటి వరకూ మహారాష్ట్రదే అగ్రస్థానం.

 

అయితే మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 850 కేసులు ఒక్క ముంబై నగరంలోనే ఉండడం పరిస్తితి తీవ్రతను తెలియజేస్తోంది. 54 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జనసాంద్రత అధికంగా ఉండే ముంబైలో వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోందని ఈ సంఖ్యను బట్టి అర్థమవుతోంది.

 

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ధారావిలో పరిస్తితి రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. గురువారం నాటికి ఇక్కడ 17 కేసులు నమోదు కాగా శుక్రవారం ఉదయం మరో 5 కేసులు పెరిగాయి. దీంతో మొత్తం 22 కేసులయ్యాయి. వీరిలో ఇద్దరు మాత్రమే ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారిగా గుర్తించారు. మిగిలిన వారికి వైరస్ ఎలా సోకిందనేదానిపై అధ్యయనం చేస్తున్నారు. ధారావిలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇక్కడ నివాసముంటున్న ప్రజలందరికీ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మురికివాడలో సుమారు 7 లక్షల మంది నివాసముంటారని అంచనా.! ఇక్కడ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్థానికంగా అన్ని దుకాణాలను మూసేయించారు. మెడికల్ షాపులు తప్ప ఎలాంటి వాటినీ తెరవనివ్వడం లేదు. రోడ్డువైపు ఎవరైనా ఏదైనా అమ్ముతున్నా, అక్కడ ఎవరైనా కొన్నా.. అరెస్ట్ చేస్తున్నారు.  

 

ముంబైలో హైఅలెర్ట్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకున్నముంబైని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానీయడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా మాస్క్‌ కంపల్సరీగా ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.ఒకవేళ మాస్క్ ధరించకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ముంబై కార్పోరేషన్ రోజుకు 1500 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంటింటికీ తిరిగుతూ వైద్య సిబ్బంది ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా వారిన క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు.

 

ముంబై మహానగరంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మొదట్లో ముంబైలోకి విదేశాల నుంచి వచ్చినవాళ్ల ద్వారానే వైరస్ ప్రవేశించింది. విదేశాల్లో కరోనా వైరస్ ప్రబలుతున్నవేళ పలు దేశాల నుంచి భారతీయులు వచ్చేశారు. పలువురు ముంబై ఎయిర్‌పోర్ట్లో దిగి స్వస్థలాలకు వెళ్లారు. ఆ క్రమంలో వైరస్ పలువురికి సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ముంబైలో బయటపడిన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లవే ఎక్కువ. వీరిలో కూడా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇటీవల నమోదవుతున్న కేసుల్లో స్థానికుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ సంఘటనగా భావిస్తున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా ముంబై, పుణెలలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. పుణెలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువ. ముంబైపై పారిశ్రామికరంగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిత్యం వేలాది మంది ఈ రెండు నగరాలకు దేశవిదేశాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. లాక్‌డౌన్‌ విధించకముందే వేలాది మంది విదేశాల నుంచి వచ్చేశారు. అలా వచ్చినవారిలోనే ఎక్కువగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈలోపు వారి నుంచి మరికొందరికి వ్యాధి సోకింది.

 

ముంబై జనాభా సుమారు 2 కోట్లు. ఇప్పుడు స్థానికులకు కూడా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేకాక ఇక్కడ మురికివాడలు ఎక్కువ. నిత్యం రద్దీగా ఉండే ఇలాంటి మురికివాడల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే ధారావి లాంటి మురికివాడల్లో ప్రతి వ్యక్తికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుమానితులను క్వారంటైన్ చేస్తోంది.

 

ముంబై లాంటి మహానగరంలో వైరస్ అడ్డుకోవడానికి ఉన్న ఏకైక అస్త్రం లాక్‌డౌన్ మాత్రమే.! నిర్బంధంగా లాక్‌డౌన్ అమలు చేస్తే తప్ప ప్రజలను కట్టడి చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తోంది. పదేపదే ఉల్లంఘిస్తున్నవారిపై కేసులు పెడుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: