దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్.. వన్యప్రాణులకు స్వేచ్ఛా జోన్ గా మారింది. ఇన్నాళ్లు సరిహద్దు అటవీప్రాంతాల్లో మనుషులు, జంతువులపై దాడి చేస్తున్న అడవిజంతువులు.. ఇప్పుడు తమ పని కామ్ గాచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా అటవీప్రాంతంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కాగా.. వన్యప్రాణులు మాత్రం గ్రామాల్లో సందడి చేస్తున్నాయి.

 

ఇది ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతం. నిన్నమొన్నటివరకూ ఈ ప్రాంతాల్లో పులులకు, పరిసర గ్రామాల ప్రజలకు.. చిన్నపాటి యుద్ధమే జరిగింది. అడవులను వదిలి మైదాన ప్రాంతాలకు వస్తున్న పులులు.. పక్కనే పెన్ గంగ దాటి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాల్లో పశువుల మందలపై దాడులు చేసి చంపేస్తున్నాయి. దాదాపు ఇరవై పశువులపైనా పులి పంజా విసిరింది. దీంతో  సహనం కోల్పోయిన గ్రామస్తులు ...  పులిని చంపేస్తామంటూ వెంట పడ్డారు.  అటవిప్రాంతానికి  వెళ్లే ప్రయత్నం చేశారు..అయితే అటవిశాఖ అదికారులు  నచ్చజెప్పడంతో శాంతించారు..అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతుండడంతో.. పులుల కలకలం తగ్గిపోయింది. జనం ఇళ్లకే పరిమితం కావడంతో.. అవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.

 

వేసవికాలంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో అడవులు  ఆకులు రాలుస్తున్నాయి. వేసవి తాపంతో వన్యప్రాణులు అల్లాడిపోయే కాలం వచ్చేసింది. ఇదే సమయంలో కరోనా వైరస్ తో జనం ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవుల్లో ఉండే  పులులు...జింకలు, మనుబోతులు, కుందేళ్లతోపాటు వివిధ రకాల జంతువులు..  గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. జనం లాక్ డౌన్ కాగా.. అవి మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి..తాజాగా కాగజ్ నగర్ లో ఎలుగుబంటి రాత్రంతా జనానికి నరకం చూపించింది..ఇళ్లపైకి ఎక్కి భయపెట్టింది. ప్రత్యేక రెస్క్యూ బృందాలు రోజంతా కష్టపడి , మత్తుమందిచ్చి దాన్ని పట్టుకోవాల్సి వచ్చింది.

 

ఆదిలాబాద్ జిల్లాకు  తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి, కొమురం భీం జిల్లాకు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి, మంచిర్యాల జిల్లాకు తడోబా ,ప్రాణహిత ఇంద్రావతి పరివాహాక ప్రాంతాలనుంచి పులులొస్తాయి.మహరాష్ట్ర్ర నుంచి వచ్చే పులులు.. కాగజ్ నగర్ , కోటపల్లి ,వేమనపల్లి అటవీ ప్రాంతాలతో పాటు వివిధ ఏరియాల్లో సంచరిస్తున్నాయి.మరీ ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ,గ్రామాల శివారులలో పులుల సంచారం పెరిగింది.చిలాటిగుడ  గ్రామా పరిసరాలలో గత 20 రోజులుగా పులి తిరుగుతోంది.  చిలాటీగుడా,  ఎర్రగుట్ట, వట్టి వాగు పరిసరాల్లో  పులి సంచరిస్తోంది.

 

చిలాటి గుడ పరిసరప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. వేసవి కాలం కావడంతో, నీటి కోసం పులి... వట్టి వాగు ప్రధాన కాల్వగుండా ఈ ప్రాంతానికి వస్తోందని అధికారులు చెబుతున్నారు.  

 

లాక్ డౌన్ ఆంక్షలతో ప్రజలు బయటకు రాకపోవడం వల్ల ... పరిసర ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నా ఇబ్బందులు తలెత్తడం లేదు. అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పులులు మళ్లీ గ్రామాల్లోకి వస్తే ఎలా అని జనం ఆందోళన చెందుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: